iDreamPost
android-app
ios-app

ఎడిటింగ్ దిగ్గజం ఇక లేరు

  • Published Jul 06, 2022 | 11:40 AM Updated Updated Jul 06, 2022 | 11:40 AM
ఎడిటింగ్ దిగ్గజం ఇక లేరు

సుప్రసిద్ధ ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఇవాళ కన్నుమూశారు. తెలుగులో సుమారు 800 సినిమాలకు పైగా తన సేవలు అందించిన ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో పాలు పంచుకున్నారు. దశాబ్దాల పాటు లెక్కలేనన్ని అద్భుతా చిత్రాలు ఈయన టైటిల్ కార్డు కలిగి ఉండేవి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న గౌతమ్ రాజు గారు హైదరాబాద్ లోని తన స్వగృహంలో చివరి శ్వాస తీసుకున్నారు.

గౌతమ్ రాజు 1954 జనవరి 15న రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు.స్వస్థలం ఒంగోలు. 1982లో జంధ్యాల దర్శకత్వం వహించిన నాలుగు స్తంభాలాటతో సినీ రంగప్రవేశం చేశారు. . డెబ్యూ మూవీనే గొప్ప పేరు తీసుకురావడంతో అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఎడిటింగ్ రంగంలోనూ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికి తనదైన ముద్రవేయగలిగారు.

చిరంజీవి నూటా యాభై చిత్రంగా చేసిన ఖైదీ నెంబర్ 150కి గౌతమ్ రాజే ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆదికి నంది అవార్డు అందుకున్నారు. చివరిసారిగా పేరు కనిపించిన సినిమా సన్ అఫ్ ఇండియా. దళపతి, అసెంబ్లీ రౌడీ, గబ్బర్ సింగ్, కిక్, రేస్ గుర్రం, ఊసరవెల్లి, బలుపు, అదుర్స్ లాంటి సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. గౌతమ్ రాజుగారికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. భౌతికంగా లేకపోయినా ఆయన అందించిన సేవలు చిరకాలం నిలిచిపోతాయి