iDreamPost
iDreamPost
గ్రామీణప్రాంత విద్యార్దులకు ఇంగ్లీషు ఒక బ్రహ్మపదార్ధం. ప్రాథమిక స్థాయిలోనైతే ఇది మరింత ఆందోళన పెంచుతుందనే చెప్పాలి. అయితే భవిష్యత్తులో ఎదుర్కొనబోయే జాబ్‌మార్కెట్‌లో సమర్ధవంతమైన స్కిల్స్ కావాలంటే ఇంగ్లీషు సబ్జెక్టులో నైపుణ్యాలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ఏంపీ సీయం వైఎస్ జగన్ ప్రాథమిక స్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రారంభించేందుకు నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం కూడా చేసాయి.
అయితే ప్రజలకు అవసరమైనది చేయడంలో వెనకడుగు వేయని జగన్ తనదైన శైలిలో వారి ప్రయత్నాలకు ఎదురొడ్డుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తెలుగు మీడియంలోనే ఉన్న విద్యార్ధులకు ఇప్పటికప్పుడు ఇంగ్లీషు వైపునకు మళ్ళించడంలో ఎదురయ్యే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ను నిపుణుల ముందు పెట్టింది ప్రభుత్వం. దీంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సూచనల మేరకు పాఠ్యపుస్తకంలో పక్కపక్కనే తెలుగు– ఇంగ్లీషులో పాఠం ఉండే విధంగా పుస్తకాలకు రూపకల్ప చేసి, ఈ యేడాది అందించాలని నిర్ణయించారు. వీటితో పాటు అదనంగా వర్కుబుక్స్‌ను కూడా ఇవ్వనున్నారు.
తెలుగు నుంచి ఇంగ్లీషు మాద్యమానికి సులభంగా మారేందుకు ఇది సమర్ధవంతంగా తోడ్పడుతుందని నిపుణులు ఇచ్చిన సూచనల నేపథ్యంలో అందుకు అనుగుణంగా 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు, లెక్కల సబ్జెక్టుల్లో ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాలుగా పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా అటు విద్యార్దులకు, ఇటు ఉపాధ్యాయులకు కూడా బోధన, అభ్యసనంలను సులభం చేస్తుంది.
చరిత్రలోనే తొలిసారిగా ప్రాథమిక విద్యలో సెమిష్టర్ విద్యావిధానంతో చిన్నారుల ముందుకు వస్తున్న ఈ పాఠవ్యాంశాల్లో అన్ని ప్రాంతాల్లోని సంస్కృతులు ప్రతిబింభించేలా దాదాపు 116 మందికిపైగా కవుల రచనలను పొందుపరిచారు. బండెడు పుస్తకాల బరువును కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సెమిష్టర్‌కు అవసరమైన పుస్తకాలను మాత్రమే ఇవ్వడం ద్వారా పుస్తకాల బరువు కూడా విద్యార్ధులకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీంతో విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులతో మార్పు కొట్టొచ్చునట్టు కన్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే నాడునేడు పథకం ద్వారా పాఠశాలల్లో త్రాగునీరు, లైట్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో ఆయా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.