తెలంగాణలో సచివాలయం కూల్చివేత పనులు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పాత సచివాలయం కూల్చివేసి నూతన సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడంతో సచివాలయం కూల్చివేత పనులు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటిసారే సచివాలయం కూల్చివేసి నూతన సచివాలయంలో నిర్మించాలని నిర్ణయించారు. కానీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆలోచన అమలు చేయడం సాధ్యపడలేదు. కాగా కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయం నిర్మించాలని కేబినేట్ లో ఆమోదించారు. జూన్ 27 న నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ కూడా చేసారు.
అయితే ప్రజా ధనాన్ని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, సచివాలయంలో అనేక నూతన భవనాలు కూడా ఉన్నాయని, వాటిని వాడుకోవచ్చని చెబుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు 10 పిటిషన్లు హైకోర్టులో దాఖలు అయ్యాయి. దీంతో మార్చ్ 10 న నూతన సచివాలయ నిర్మాణ తీర్పును హైకోర్టు రిజర్వ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా ఈరోజు సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో సచివాలయ కూల్చివేత పనులను అధికారులు మొదలుపెట్టారు.
కూల్చివేత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సచివాలయం వైపు వెళ్లే అన్ని దారులను మూసివేసి కూల్చివేత పనులను సీఎస్, డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.