iDreamPost
android-app
ios-app

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

  • Published Nov 02, 2019 | 7:32 AM Updated Updated Nov 02, 2019 | 7:32 AM
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై ఆయా ప్రభుత్వాలు వేస్తున్న అడుగులతో ఒక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే, మరో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. ఆ అంశమే ఆర్టీసీ. ఒకే అంశం పై ఇరు రాష్ట్రాల సీఎం లు తమ మాటలపై నిలబడి ముందుకు పోతున్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆర్టీసీ ని విలీనం చేస్తానని కరీంనగర్ సభలో హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని  కార్మికులు సమ్మె చేస్తున్నారు. 

ఆంధ్ర లో సానుకూలం.. 

ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మంత్రి మండలి లో తీర్మానం కూడా చేసింది. నిపుణుల కమిటీ వేసింది. తాజాగా శుక్రవారం ఆర్టీసీ పాలక మండలి తన సమావేశంలో ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం చేస్తూ తీర్మానం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ సర్కార్ కంకణం కట్టుకున్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎంత మాత్రం జరుగుతుందో అది చూస్తారు గా అని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయగా.. అందుకు భిన్నంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రయాణం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వేగంగా గమ్యం వైపు వెళుతోంది. 

తెలంగాణాలో పీటముడి.. 

ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతుంటే తెలంగాణాలో మాత్రం ఆర్టీసీ భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం లో విలీనం చేయాలని కార్మికులు, వెయ్యి శాతం సాధ్యం కాదని కేసీఆర్.. ఇలా ఇరుపక్షాలు మంకుపట్టు పై ఉన్నాయి. 29 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. భవిష్యత్ పై ఆందోళనతో పలువురు కార్మికులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. మరి కొందరు గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ హైకోర్టు కు చేరింది. ఐనా పరిస్కారం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. 

కేసీఆర్ తీరు సరైనదేనా..? 

సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకోని సమ్మె విరమింప జేయడం సర్వాధారణంగా జరిగేది. కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. చర్చలకు పిలవండి సీఎం సారూ.. అంటూ కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నా, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. టిఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు కె. కేశవ రావు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తన్న ప్రకటన చేశారు. కానీ ఎంత వేగంగా ఢిల్లీ నుంచి వచ్చారో అంతే వేగంగా సైలెంట్ అయ్యారు. కేసీఆర్ దొర లా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాల చాల కాలంగా విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ విషయంలో కేసీఆర్ వైఖరి అలానే ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రజా స్వామ్య ప్రభుత్వాలు  సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి. కానీ కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పై వ్యవహరిస్తున్న తీరు సైనదేనా అన్న ప్రశ్న ప్రజలు మనస్సుల్లో మొదలైంది.  

ఆర్టీసీ వ్యాపార సంస్ధనా… ?

ప్రజా జీవితంలో రవాణా అతి ముఖ్యమైన అంశం. ఆ దేశం, ప్రాంతం ఎంత అభివృద్ధి సాధించాయో అక్కడ ఉన్న రవాణా సౌకర్యాలని బట్టి అంచనా వేయవచ్చు. ముఖ్యంగా ప్రజా రవాణా సౌకర్యం.. వేగంగా, చౌక లభిస్తే సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు ఏంతో మెరుగు పడతాయి. అందుకే ఆర్టీసీని ‘ప్రగతి రధ చక్రాలు’ అని సంబోధిస్తాం. కానీ కొన్ని ప్రభుత్వాలు మాత్రం లాభ నష్ఠాల లెక్కలు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

పరిపాలన అంటే అదే కదా.. 

ఆయా పార్టీ ప్రభుత్వాల పాలన లక్ష్యం అంతిమంగా అభివృద్ధి, సంక్షేమం. ఆర్టీసీ సమ్మె వ్యవహారం కేవలం కార్మికులు, ప్రభుత్వానిదే కాదు. యావత్ తెలంగాణ ప్రజలు ఈ అంశం వల్ల ఇబ్బదులు పడుతున్నారు. సమ్మె వల్ల దసరా సెలవులు వారం రోజులు పొడిగించడం తో విద్యార్దులు విలువైన సమయం కోల్పోయారు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగర శివార్ల నుంచి నగరాల్లోకి వచ్చే బడుగుజీవులు తమ కష్టం లో అంతకు ముందు కన్నా ఎక్కువ మొత్తం రవాణా కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక ఆస్పత్రులకు వచ్చే వారి బాధలు వర్ణనాతీతం. పంతాలకు, పట్టింపులకు వెళ్లకుండా సమస్య పరిస్కారం దిశగా ప్రభుత్వం, కార్మిక సంఘాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.