Idream media
Idream media
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గరం.. గరంగా జరగనున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తేనే అర్థమవుతోంది. పార్టీలన్నీ ఆ రెండు స్థానాల్లో పాగా వేయడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఓటమి పాలైన అధికార పక్షమైన టీఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. దీంతో పార్టీలన్నీ ఓటరు నమోదు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ గ్రాడ్యుయేట్ లను ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. తాజాగా మంత్రి తలసానిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ దిశా నిర్దేశం
ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే పలు దఫాలు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయన సూచనల మేరకు ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు స్థానిక శ్రేణులను సిద్ధం చేశారు. డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు అప్పగించి పట్టభద్రులను కలుసుకోవాలని సూచించారు. దీంతో చాలా మంది ఇంటింటికీ వెళ్లి ఓటరుగా నమోదు చేసుకోని పట్టభద్రులతో నమోదు చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈసారి అలా జరగకుండా తప్పకుండా విజయం సాధించేలా పని చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రధాన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. తలసాని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తిరుగుతూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
తలసానిపై ఈసీకి ఫిర్యాదు.. టీఆర్ఎస్ లో హీట్
ఇదిలా ఉండగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటోంది. గత ఏడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ సారి టీఆర్ఎస్ ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా…ఓటర్లను నమోదు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఫేక్ సర్టిఫికేట్లను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి తలసానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని శశిధర్‌రెడ్డి చెప్పడం టీఆర్ఎస్ వర్గాల్లో హీట్ పెంచింది. చెప్పారు. గెలిచే సత్తా లేని కాంగ్రెస్ ఇటువంటి ఫిర్యాదుల పర్వానికి తెరలేపుతోందని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.