దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ తరువాత అధికార ప్రతిపక్ష పార్టీల చూపు వరంగల్ వైపు మళ్లింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటాలనుకుంటోంది. అధికార పార్టీ సైతం మరోమారు ఓరుగల్లు కోటపై గులాబీ జెండా ఎగరేయాలనుకుంటోంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు రిపీట్ కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలనుకుంటోంది. అభివృద్ధి నినాదంతోనే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటోంది. తర్వలో జరగునున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పై వరాల జల్లు కురిపించాడనే వాదనా వినిపిస్తోంది.
రాష్ట్ర అవతరణ నుంచి దుబ్బాక ఉప ఎన్నికల వరకు తెలంగాణలో టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా నిరూపించుకుంటూ వచ్చింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం వెనక్కి నెట్టి అధికార పార్టీతో తలపడింది బీజేపీ. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లోనూ బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తన దృష్టిని వరంగల్ వైపు మళ్లించింది. త్వరలో జరగనున్న వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పై దాడి మొదలు పెట్టింది.
బీజేపీ అగ్రనేతలు వరుసగా వరంగల్ లో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అధికార పార్టీ వరంగల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత మురళీధర్‌రావు బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ఎన్నికలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, డిసెంబర్ 7 తరువాత అందిస్తామన్న వరదసాయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఎన్నికలు లేవనే వరంగల్‌లో వరద సాయం ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. వరంగల్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం ఇచ్చిన 196 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు మాత్రమే విడుదల చేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సైతం బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం గిరిజన యూనివర్సిటీని విస్మరించిందని, టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి సహకరించలేదని, కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు.
పరస్పరం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పై వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజూ ప్రతి ఇంటికీ మంచినీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. కేటీఆర్ వరంగల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ హామీ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో అధికార పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను రాబట్టుతుందో చూడాలి మరి.