Idream media
Idream media
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గరం.. గరంగా జరగనున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తేనే అర్థమవుతోంది. పార్టీలన్నీ ఆ రెండు స్థానాల్లో పాగా వేయడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఓటమి పాలైన అధికార పక్షమైన టీఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా గ్రాడ్యుయేట్లను తమ వైపు తిప్పుకుంటోంది. ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. ఇప్పటికే ఓటరు నమోదు కూడా పూర్తయింది. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే పలు దఫాలు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయన సూచనల మేరకు ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లో పట్టభద్రులతో ఇప్పటి నుంచే టచ్ లో ఉంటున్నారు. డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు పంచుకుని పట్టభద్రులను కలుసుకుంటున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈసారి అలా జరగకుండా తప్పకుండా విజయం సాధించేలా పని చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తనదే పై చేయి కావాలని బీజేపీ తహతహలాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాషాయానికి అనుకూలంగా గాలి వీస్తుండడంతో ఎమ్మెల్సీలను పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఆ పార్టీదే. ఈసారి నుంచి వరంగల్-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటును తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, వరంగల్-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డిల పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి నుంచే ఆయా అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమ వల్లే ఉద్యోగాలు ఇవ్వాలన్న కదలిక ప్రభుత్వంలో వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆలస్యం కారణంగానే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యామంటూ చెప్పుకొస్తున్న కాంగ్రెస్.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తర్జనభర్జన పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందే వరంగల్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన టీపీసీసీ.. అభ్యర్థుల నిర్ణయానికి సంబంధించి ఇంతరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. రెండు నియోజకవర్గాలకు కలిపి 50మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకోగా.. ఓటర్ల నమోదుపైన దృష్టి పెట్టాలంటూ వారికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆ తర్వాత పార్టీ నాయకత్వం దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలమునకలై పోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైనా అందులో సభ్యుల నియామకమూ జరగలేదు. దీంతో కమిటీ కసరత్తూ ఏ మాత్రం ముందుకు సాగడంలేదు.