iDreamPost
android-app
ios-app

తెలంగాణలో రాజీనామాల రాజకీయం!

  • Published Aug 09, 2021 | 2:53 AM Updated Updated Aug 09, 2021 | 2:53 AM
తెలంగాణలో రాజీనామాల రాజకీయం!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్నవి రెండే రెండు. మొదటిది హుజూరాబాద్, రెండోది దళిత బంధు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హుజూరాబాద్ లో రైతు బంధును అమలు చేస్తే లేని సమస్య.. దళిత బంధును అమలు చేస్తే ఎందుకని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో రాజీనామాల ట్రెండ్ మొదలైంది. తమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని, నిధులిస్తామంటే తాము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేతలు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో రాజీనామాల రాజకీయాలకు ఆద్యుడు కేసీఆరే కాగా, ఇప్పుడు అగ్గి రాజేసింది మాత్రం ఈటల రాజేందరే.

కేసీఆర్, హరీశ్ ను పోటీకి రమ్మంటున్న ఈటల

తెలంగాణలో రాజకీయ అలజడికి కేంద్ర బిందువు మాజీ మంత్రి ఈటల రాజేందర్. మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో కేసీఆర్ పరోక్ష చర్యలు తీసుకున్నారు. భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల.. బీజేపీలో చేరిపోయారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ టీఆర్ఎస్ కు సవాలు చేశారు. తన మీద పోటీ చేయాలంటూ తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు చాలెంజ్ విసిరారు. ఈటల రాజీనామాతో మొదలైన వ్యవహారం.. చినికి చినికి గాలివానలా మారింది. హుజూరాబాద్ లో దళిత బంధు ప్రకటిస్తామని చెప్పడంతో.. తమ నియోజకవర్గాల్లోనూ స్కీమ్స్ పెట్టాలని, తాము కూడా రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి సంఖ్య రానురాను పెరుగుతోంది.

బాండ్ పేపర్ తో రెడీ అంటున్న కోమటిరెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా కేసీఆర్ కు ఆయన సవాల్ చేశారు. చౌటుప్పల్ లో జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, ఇతర పెండింగ్ పనులు పూర్తి చేస్తే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు అన్నదమ్ములం రాజీనామా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని బాండ్లు రాసిస్తామని మరీ చెప్పారు. వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

అన్న కంటే ముందు రాజగోపాల్ కూడా..

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అంటూ మధ్యలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ టీఆర్ఎస్ తో డీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని రోజుల కిందట మంత్రి జగదీశ్ రెడ్డితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మైకు లాక్కున్నంత పని చేశారు. అంతకుముందు తన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ సర్కారు ప్రకటిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారాయన. నిజానికి దళిత బంధు విషయంలో రాజీనామా ప్రకటన ముందు చేసింది రాజగోపాల్ రెడ్డే.

ప్యాకేజీ ప్రకటిస్తే రాజీనామా చేస్తానన్న రాజా సింగ్

2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘు నందన్ రావు గెలిచారు. గోషామహల్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజాసింగ్.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ప్యాకేజీని ప్రకటించిన వెంటనే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది లీడర్లు ఇలాంటి ప్రకటనలు చేస్తారో మరి.