iDreamPost
android-app
ios-app

తెలంగాణ రెవె”న్యూ”చ‌ట్టం ఏం చెబుతోంది..

తెలంగాణ రెవె”న్యూ”చ‌ట్టం ఏం చెబుతోంది..

“తెలంగాణ వ‌చ్చిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో.. ఈ బిల్లు పెట్టినందుకు అంత సంతోషంగా ఉన్నా.. ” అసెంబ్లీ లో కొత్త రెవెన్యూ చ‌ట్టానికి సంబంధించిన బిల్లు పెడుతున్నప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లివీ. కేసీఆర్ ఎందుకంత ఉద్విగ్నానికి లోన‌వుతున్నారు… అస‌లు ఈ బిల్లులో ఏముంది..? ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి న‌ష్టం..? ఇప్పుడు తెలంగాణ‌లో అంత‌టా దీనిపైనే చ‌ర్చ‌. ఈ బిల్లు తెచ్చినందుకు టీఆర్ఎస్ వ‌ర్గాలు కేసీఆర్ కు క్షీరాభిషేకాలు చేస్తున్నాయి.., కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అస‌లీ చ‌ట్టం తెచ్చిన మార్పులు తెలుసుకోవాల‌నే ఆతృత అంద‌రిలోనూ క‌లుగుతోంది.

వేర్వేరుగా రిజిస్ట్రేష‌న్లు

వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్లు ఇక‌పై వేర్వేరుగా జ‌ర‌గ‌నున్నాయి. అలాగే వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్‌ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్‌ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్‌ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్‌ పడింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్‌ (భూ బదలాయింపు), పాస్‌ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్‌ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్‌సైట్‌ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్‌స్టాప్‌ పడింది.

ధ‌ర‌ణి కార్య‌క‌లాపాల కోసం ధ‌ర‌ణి పోర్ట‌ల్

డిజిట‌ల్ స‌ర్వే, ఇన్ స్టంట్ రిజిస్ర్టేష‌న్, మ్యుటేష‌న్, ధ‌ర‌ణి పోర్ట‌ల్.. ఇలా రెవెన్యూ సేవ‌ల‌లో సాకేంతిక‌తోకూడిన విప్ల‌వాత్మ‌క మార్పులు రానున్నాయి. అత్య‌ధిక లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారానే స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్‌/సబ్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్‌ విధానంలో రుణాలు అందనున్నాయి. ప్రతి భూ లావాదేవీని ఆన్‌ లైన్‌ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్‌సైట్‌ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్‌–ఏ(వ్యవసాయ), పార్ట్‌–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్‌ లాక్‌ వ్యవస్థను కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్‌ స్టోరేజ్‌ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు.

తహసీల్దార్ లే సబ్‌ రిజిస్ట్రార్‌లు!

వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు ఇక‌పై త‌హ‌సీల్దార్లే చేయ‌నున్నారు. వెంట‌నే మ్యుటేష‌న్ అయిపోతుంది. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షించే వీరు ఇక నుంచి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా కూడా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్‌ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. అయితే వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు.

రెవెన్యూ కోర్టుల స్థానంలో…

రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్‌ ట్రాక్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్‌ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్‌ ఉత్తర్వులే అంతిమం.

కొన్ని అధికారాల‌కు క‌త్తెర‌

త‌హ‌సీల్దార్ల‌కు కొన్ని అద‌న‌పు అధికారాల‌ను ఇచ్చిన ప్ర‌భుత్వం.. అదే క్ర‌మంలో కొన్ని అధికారాల‌ను క‌త్తిరిచ్చింది కూడా. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు.

జీహెచ్ఎంసీపైనా ప్ర‌భావం

కొత్త రెవెన్యూ చ‌ట్టం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పై కూడా ప్ర‌భావం చూప‌నుంది. ఇక‌పై మ్యుటేష‌న్ జారీ చేసే అధికారాలు జీహెచ్ఎంసీ అధికారుల‌కు ఉండ‌వు. భ‌వ‌నాలు, అపార్ట్ మెంట్ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు కొనుగోళ్లు, అమ్మ‌కాళ్లు జ‌రిగిన‌ప్పుడు మ్యుటేష‌న్ (పేరు మార్పిడి) అధికారాలు ఇప్ప‌టి వ‌ర‌కూ జీహెచ్ఎంసీకి ఉండేవి. కొత్త చ‌ట్టం ప్ర‌కారం.. ఇక త‌హ‌సీల్దార్లే జారీ చేయ‌నున్నారు. రిజిస్ర్రేష‌న్ స‌మ‌యంలోనే స‌బ్ రిజిస్ర్టార్ విలువ‌లో 0.6 శాతం రుసుమును జీహెచ్ఎంసీ పేరుతో డీడీల రూపంలో కొనుగోలుదారులు అంద‌జేసేవారు. ఆ ఆదాయం జీహెచ్ఎంసీ కోల్పోనుంది. ఒక ప‌ని కోసం వేర్వేరు కార్యాయాలు తిరిగే ప‌ని లేకుండా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ చ‌ట్టం వీటికి వ‌ర్తించ‌దు…

కొత్త రెవెన్యూ చ‌ట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్‌లో పెడతారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. ఇప్పటివరకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంది. వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1908 కింద విచారణకు అర్హత ఉంది.

కొంద‌రు లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌లు

ఈ చ‌ట్టం ప్ర‌కారం రిజిస్ట్రేష‌న్.. మ్యుటేష‌న్.. పాస్ బుక్ ల జారీ.. అన్నింటినీ ఒకేసారి చేసే వెసులుబాటు క‌ల‌గ‌నుంది. ఒక్కో దానికి ఒక్కో సారి తిరిగే ప‌ని లేకుండా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే అన్నింటినీ ఒకే రోజు చేసుకోవ‌డం సామాన్యుల‌కు అయ్యే ప‌ని కాద‌ని కొంద‌రి వాద‌న‌. ఫీజుల పేరిట ఒకేసారి డ‌బ్బులు క‌ట్టడం వారికి సాధ్యం కాదు కాబ‌ట్టి.. ఎవ‌రైతే డ‌బ్బులు చురుగ్గా ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రో వారి ప‌నులే ముందుగా జ‌రుగుతాయ‌ని కొన్ని స‌మ‌స్య‌లు లేవ‌నెత్తుతున్నారు.