తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది.. ఒకదాని తర్వాత మరొకటి ఎన్నికలు వస్తూనే ఉండడంతో నేతలు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, బుజ్జగింపులు, ప్రలోభాల పర్వాల్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. మిగిలిన ఆరు చోట్ల పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 6 స్థానాలకు జరిగే పోలింగ్ కోసం 37 కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం ఓటర్లు5,326 మంది కాగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.
కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు,ఆదిలాబాద్‌లో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఐదు జిల్లాల్లో గులాబీ దండుకు మెజార్టీ ఉండడంతో అక్కడ ఉన్న ప్రస్తుత బలాబలాల ప్రకారం సులువుగా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంటున్నారు. అయితే ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉండడం, కరీంనగర్‌లో టీఆరెస్ రెబల్ గా మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీలో ఉండడం కాస్త ఇబ్బందికర అంశాలు అనే చెప్పాలి.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం రవీందర్ సింగ్‌కు మద్దతు ప్రకటించడంతో ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం వెంటాడుతోంది. విజయం ఖాయమైనప్పటికీ ముందు జాగ్రత్తతో టీఆర్ఎస్ తమ ఓటర్లు చేజారకుండా జిల్లాల వారీగా అందరినీ క్యాంపులకు తరలించింది. రిసార్టుల నుంచి వారిని నేరుగా పోలింగ్ కు తరలించారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాల్లో ఒక్క జిల్లాలో కూడా మిగతా ఏ పార్టీకి టీఆర్ఎస్‌తో పోటీ పడేంత సంఖ్యాబలం లేదు. అయినప్పటికీ తమ ఓటర్లు ఎక్కడ చేజారిపోతారోనన్న భయంతో టీఆర్ఎస్ జాగ్రత్త పడింది. ఇక ఈరోజు జరిగిన ఎన్నికలకు సంబందించిన ఫలితాలు 14న ప్రకటిస్తారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు 11 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.
Also Read : మరి ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ ఏంటి?