iDreamPost
android-app
ios-app

శ‌భాష్ అపినించుకుంటున్నమంత్రి హ‌రీశ్‌..!

శ‌భాష్ అపినించుకుంటున్నమంత్రి హ‌రీశ్‌..!

హ‌రీశ్ రావు త‌న్నీరు.. తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన పేరు. ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడు. త‌న కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఏ ప‌ని చేసినా త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేకత చాటుకుంటారు. ప్రజల మనసులను దోచుకుంటారు. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలోనూ, స్వ‌ప‌క్షాన్ని కాపాడుకోవ‌డంలోనూ త‌న‌కు తానే సాటి. టీఆర్ఎస్ లో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. మంచి మంత్రిగా, నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ అనాథ కోసం ప‌త్రిక‌లో చూసిన క‌థ‌నాన్ని చ‌దివి ఆమెను ఆద‌రించారు. ఆటో కార్మికుల కోసం సొంత ఇంటి స్థ‌లాన్నే తాక‌ట్టు పెట్టి రూ. 45 ల‌క్ష‌లు అందించారు. త‌న ప్రాంతాన్ని మోడ‌ల్ గా తీర్చిద్ద‌డ‌మే కాదు.. ప్ర‌జా సేవ‌లోనూ అంద‌రికీ మోడ‌ల్ గా మారారు. సిద్ధిపేట‌ను అద్భ‌త సిటీగా తీర్చిదిద్దారు. గ్రేట‌ర్ లోని కేబుల్ వంతెన త‌ర‌హాలో అక్క‌డో ఎప్పుడో నిర్మాణం చేప‌ట్టారు. తెలంగాణ‌లో ఉద్య‌మంలోనూ కీల‌క పాత్ర వ‌హించిన మంత్రి హ‌రీశ్ రావు తాజాగా పారిశుధ్య కార్మికుడి అవ‌తారం ఎత్తి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

హ‌రీష్ రావు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ(టీఆర్ఎస్‌)లో కీల‌క నాయ‌కుడు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగారు. 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా పని చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగెట్టారు.

రికార్డుల మంత్రి

తెలంగాణ కోసం రాజీనామా చేసి సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచారు. 2010లో నాటి యూపీఏ ప్ర‌భుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప‌త్రిక‌ల క‌థ‌నాల‌పై చ‌లించే గుణం..

చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లికి చెంది…చెందిన భాగ్య 2018లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలింది. దిన పత్రికల్లో ఆమె ధీనావస్థపై వచ్చిన కథనాన్ని చూసి స్పందించిన మంత్రి హరీశ్ రావు వెంటనే కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో మాట్లాడి భాగ్య సంరక్షణ బాధ్యతలు చూడాలని సూచించారు. మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనంలో ఆమెకు వసతి కల్పించారు. చదువు పూర్తయిన తరువాత బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం కల్పించారు. అంతేకాదు ఆమెకు నచ్చిన వాడికి ఇచ్చిఅంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

స్థ‌లాన్ని తాక‌ట్టు పెట్టి

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయాలని భావించారు మంత్రి హరీశ్ రావు. సంఘాన్ని అయితే ఏర్పాటు చేయించారు కానీ, దానికి ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా తన భూమినే తాకట్టు పెట్టారు. రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘం కోసం సభ్యులు తమ వాటా ధనంగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున మొత్తం రూ. 8.55 లక్షలు జమచేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది. మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో డ్రైవర్లు అందరూ కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వినిపించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రంగధాంపల్లిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు తీసుకుని ఆ మొత్తాన్ని మూలధనంగా జమ చేయించారు. ఫలితంగా రూ. 53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. ఇందులో 666 మంది కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇప్పించారు.

పారిశుధ్య కార్మికుడిగా అవ‌తారం

ప్ర‌స్తుతం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఉన్న‌ట్టుండి పారిశుధ్య కార్మికుడి అవతారం ఎత్తారు. సిద్దిపేటలో తడి పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ నిన్న (మంగళవారం) ప్రారంభం చేశారు. ఇందులో భాగంగానే పారిశుధ్య కార్మికుల యూనిఫాం వేసుకొని తడి పొడి చెత్తను మిషన్ లో వేసిన మంత్రి హరీష్రావు.. మున్సిపల్ కార్మికులకు స్పూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా కార్మికులు ధరించే యూనిఫామ్ ను వేసుకున్న హరీశ్ రావు వృథా అని భావించే ప్రతి వస్తువునూ ఏదో రూపంలో తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్మికుల యూనిఫామ్ ధ‌రించి స్వ‌యంగా చెత్త‌ను ఎత్తి మిష‌న్ లో వేయ‌డం స్థానికుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇలాంటివెన్నో కార్య‌క్ర‌మాల ద్వారా హ‌రీశ్ రావు సిద్ది పేట‌లో తిరుగులేని రాజ‌కీయ‌కుడిగా గుర్తింపు పొందారు.