గ్రేటర్ అధికార పీఠంపై క్లారిటీ రాలేదు కానీ… ఎన్నికల హామీలు మాత్రం అమలులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పడు వాటి అమలుపై దృష్టి సారించింది ప్రభుత్వం. మేయర్ పీఠాన్ని అధిరోహించకముందే తొలి అడుగు మెదలెట్టింది. ఉచిత మంచి నీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గృహ వినియోగదారులకు ఉచితంగా నెలకు 20వేల లీటర్ల మంచి నీటిని అందించేందుకు జలమండలి కసరత్తు ఆరంభించింది.
గ్రేటర్ పరిధిలో పది లక్షలకు పైగా మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో మెజార్టీ కనెక్షన్ లు గృహవినియోగదారులకు చెందినవే. వాణిజ్య, పారిశ్రామిక రంగంలో దాదాపు 50 వేల కనెక్షన్లు ఉంటాయి. ప్రతి నెలా జలమండలికి సమకూరే ఆధాయంలో మెజార్టీ భాగం పారిశ్రామిక, వ్యాపార కనెక్షన్ల నుంచే వస్తుంది. గృహ వినియోగదారుల నుంచి ప్రతి నెలా దాదాపు 30 కోట్ల రూపాయల ఆధాయం వస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత మంచినీటి పథకం కింద జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 9.5 లక్షల వినియోగదారులు లబ్దిపొందనున్నారు. 20వేల లీటర్ల పథకం వర్తించే గృహ వినియోగదారులు ఆథార్ కార్డుతో పాటు కనెక్షన్ వివరాలను జలమండలికి సమర్పించాల్సి ఉంటుంది. వివరాల పరిశీలన అనంతరం ఉచిత నీటి సరఫరాను వర్తింపజేస్తారు. గ్రేటర్ పరిధిలోని 97 శాతం ప్రజలకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా చేస్తామని, డిసెంబర్ నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఉచిత మంచి నీటి పంపిణీ హామీ ఇచ్చాయి. ఫలితాల్లో మెజార్టీ స్థానాల్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ మేయర్ పీఠానికి చేరువ కాలేకపోయింది. అయినా…. ఏ పార్టీకి సరైన బలం లేనందున మేయర్ పీఠం చేజారుతుందన్న భయం టీఆర్ఎస్ కు లేదు. అందుకే… ఎన్నికల హామీల అమలుతో ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ప్రయత్నంగా ఉచిత నీటి పంపిణీని ఆరంభించింది.
ప్రతిపక్ష పార్టీలను అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎదుర్కోవాలనుకుంటోంది అధికార పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసు దోచుకోవాలనుకుంటోంది. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మోటార్ వాహన పన్ను మాఫీ, సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్, చిన్న బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రీయంబర్స్ మెంట్ లాంటి పలు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది టీఆర్ఎస్. ఉచిత మంచినీటి సరఫరాతో మొదలైన హామీల అమలు ఒక్కొక్కటిగా నెరవేర్చే అవకాశం ఉంది.