తుది శ్వాస వరకూ కాంగ్రెస్ లోనే అత్యున్నత పదవుల్లో కొనసాగిన పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల నిర్వహణలో కాంగ్రెస్ ఆలస్యంగా మేల్కొందా..? ఈ విషయంలో ముందడుగు వేసి తెలంగాణ ప్రభుత్వం మార్కులు కొట్టేసిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పీవీని తొలి నుంచీ తమ వాడిగా గుర్తించ లేదనే అపవాదు ఉన్న ఆ పార్టీపై ఇప్పుడు మరికొన్ని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శత జయంతి వేడుకల నిర్వహణ విషయంలోనూ ముందస్తుగా స్పందించకపోవడం.. పీవీ కుటుంబ సభ్యులతో చర్చించకపోవడం ఆ పార్టీకి తెలంగాణలో మైనస్ అయిందని చెప్పొచ్చు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం.. కొద్ది రోజులకు నష్ట నివారణ కోసం మాజీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మాజీ ఎంపీ వీహెచ్ గౌరవాధ్యక్షునిగా టీపీసీసీ పీవీ శత జయంతి ఉత్సవ కమిటీని వేసింది. ఈనెల 24న ఇందిరా భవన్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి ఇళ్లకు వెళ్లి కోరినా.. తగిన సమయంలో స్పందించలేదనే కారణంతో వారు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అప్పటికే ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించి ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి.. అందులో పీవీ కుటుంబ సభ్యులకూ చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో టీఆర్ఎస్ బాగానే చొరవ చూపింది. అది రాజకీయ ఎత్తుగడ అని కొందరు.. తెలంగాణ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన పీవీకి శత జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించడం సముచితమని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ దిద్దుబాట..
పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే టీపీసీసీ నేతలు సమావేశమై పీవీ జయంతి వేడుకలను ఘనంగా ఏడాది పాటు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి ముందే సమాచారం అందుకున్న సోనియా.. పీవీ గురించి ఎవరు వేడుకలు చేసిన స్వాగతిస్తామని పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా.. 2023లో పీవీ స్పూర్తితో పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని కూడా ప్రకటించారు. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం వంటి నేతలంరూ పీవీ గురించి సందేశాలు ఇచ్చారు. పీవీ సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని మన్మోహన్ సింగ్ కొనియాడారు.
టీపీసీసీ ఆధ్వర్యంలోనూ..
ఇందిరాభవన్‌లో పీవీ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారని చెప్పారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే అని చెప్పుకొచ్చారు.