Idream media
Idream media
ఊహించిందే నిజమవుతోంది. ఎన్నికల ప్రచారం కొంప ముంచుతోంది. తెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాజకీయ వర్గాలు కలవరపాటుకు గురవుతున్నాయి. అంతేకాదు.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న నోముల భగత్ పాటు కీలక నేతలకు కూడా సోమవారం పాజిటివ్ వచ్చింది. రాబోయే మూడు రోజుల్లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రచారం జరుగుతుండగానే.. ఏప్రిల్ మొదటి వారంలోనే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడికి ఆర్మూరు జడ్పీటీసీకి, మరో నలుగురు ఆర్మూర్ నేతలకు కరోనా సోకింది. దీంతో నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో ప్రచారంలో ఉన్న వారు వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. తాజాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్‌తోపాటు ఆయన తల్లి, భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సాగర్ టికెట్ ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్ మరో కీలక నేత ఎంసీ. కోటిరెడ్డి, ఇటీవలే బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కడారు అంజయ్యయాదవ్‌లకు కరోనా సోకింది. వీరితోపాటు త్రిపురారం మార్కెట్ కమిటీ చైర్మన్ జానయ్య, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ డ్రైవర్, గన్‌మన్‌లు సైతం కరోనా బారిన పడ్డారు.
అంతేకాదు.. ప్రచారం నిమిత్తం నాగార్జునసాగర్‌కు వచ్చిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు బస చేసిన ఇంటి యజమానులకు కూడా కరోనా సోకింది. ఎంసీ కోటిరెడ్డి గ్రామంలో ముగ్గరు కీలక నేతలకు పాజిటివ్ అని తేలింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల విఽధుల్లో పాల్గొన్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా సోకింది. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాలి రంజిత్ సింగ్ తిరుమలగిరి మండలం రంగుండ్ల తండాలో ఈ నెల 15న ఎన్నికల విధుల్లో పాల్గొనగా 17వ తేదీన శ్వాస ఆడటం లేదంటూ మిర్యాలగూడలో ఆస్పత్రిలో చేరి; 19వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ కరోనాతో గత కొద్ది రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.
ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక వరుస విధులతో ఆయన కరోనా బారిన పడ్డారు. ఉప ఎన్నికకు ముందు అనుముల పీహెచ్‌సీ పరిధిలో ప్రతి రోజు రెండు లేదా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆ సంఖ్య సోమవారం ఒక్కరోజే 66కు చేరింది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లోనే సోమవారం ఒక్క రోజే 160 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. పెద్దవూర మండల పరిధిలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూరులో 7, నాగార్జునసాగర్‌లో 17 కేసులు నమోదయ్యాయి. గత 45 రోజుల పరిధిలోనే సాగర్ నియోజకవర్గంలో రెండు వేల కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రచారానికి ఆటోలో కూలీలు కిక్కిరిసి వెళ్లడొ, లాడ్జీలలో నేతలు బస చేయడం మూలంగా వేగంగా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ కేసుల సంఖ్య భారీగా ఉంటుందన్న అంచనాలో వైద్యాధికారులు ఉన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాలియాలో నిర్వహించిన సభలో పాల్గొనడం ద్వారానే కేసీఆర్‌కు కరోనా వచ్చి ఉంటుందనే పలువురు భావిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో ఫామ్ హౌస్‌లోనే కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని చీఫ్ సెక్రటరీ అధికారికంగా వెల్లడించారు.
Also Read : ఈటల ఇలా.. శ్రీనివాసరావు అలా.. కరోనాపై పొంతన లేని మాటలు