iDreamPost
android-app
ios-app

తీన్మార్ సెంటిమెంట్ బ్రేకవ్వాలి

  • Published Jan 16, 2021 | 6:26 AM Updated Updated Jan 16, 2021 | 6:26 AM
తీన్మార్ సెంటిమెంట్ బ్రేకవ్వాలి

పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో రూపొందబోయే అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కు సంభాషణల రచయితగా త్రివిక్రమ్ పేరు అనౌన్స్ చేయగానే పవర్ స్టార్ అభిమానులకు ఒకపక్క సంతోషంతో పాటు టెన్షన్ కూడా కలుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఓ నెగటివ్ సెంటిమెంట్ ని వాళ్ళు ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాక బయటి సినిమాలకు డైలాగులు రాయడం మానేశారు. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే దానికి ఒప్పుకున్నారు. అందులో ఒకటి 2011లో వచ్చిన పవన్ సినిమా తీన్మార్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద డిజాస్టర్. పాటలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. దానికి రచన చేసింది మాటల మాంత్రికుడే.

ఈ తీన్మార్ కూడా రీమేక్ సినిమానే కావడం గమనార్హం. హిందీ బ్లాక్ బస్టర్ లవ్ ఆజ్ కల్ ని తెలుగు ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు తెరకెక్కించలేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. దీనికన్నా ముందు 2005లో జై చిరంజీవా కోసం కలం పట్టారు త్రివిక్రమ్. ఇది కూడా స్ట్రెయిట్ మూవీనే. తన కెరీర్ లో పెద్ద మలుపులకు కారణమైన డైరెక్టర్ విజయ్ భాస్కర్ తో పాటు మెగాస్టార్ మూవీ కావడంతో ఒప్పుకున్నారు. ఇదీ దారుణంగా బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఇంకెవరికి రచన చేయలేదు త్రివిక్రమ్. మళ్ళీ తొమ్మిదేళ్ల తర్వాత తన ప్రాణ స్నేహితుడి కోసం మరోసారి రెడీ అన్నారు. ఇప్పుడా ఫలితం రిపీట్ కాకూడదనే ఫ్యాన్స్ కోరిక.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి కూడా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. తీన్మార్ లాగే ఇది కూడా రీమేక్ కావడమే మెగా ఫాన్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది. అయినా కంటెంట్ బలంగా ఉంటే ఇవన్నీ పనిచేయవు కానీ ఫైనల్ గా ఫలితాన్ని శాసించేది మాత్రం ప్రేక్షకులకు నచ్చాల్సిన కథా కథనాలు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి బిల్లారంగా పేరుని గట్టిగానే పరిశీలిస్తున్నారట. హీరోయిన్లు ఎవరో కన్ఫర్మ్ కావాల్సి ఉంది. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ అంటున్నారు కానీ అధికారికంగా తెలిసే దాకా చెప్పలేం. లెట్ వెయిట్ అండ్ సి.