iDreamPost
iDreamPost
ఫస్ట్ టైం నాగ చైతన్య- సాయి పల్లవిల కాంబినేషన్ లో రూపొందుతున్న లవ్ స్టోరీ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బ్యాలన్స్ ఉన్న కొద్దిపార్ట్ ని పూర్తి చేసేందుకు టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగి అన్ని రకాల జాగ్రత్తలతో షూటింగ్ చకచకా కానిచ్చేస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా ఇది ఓటిటిలో రావొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు భారీ ఆఫర్లతో ఊరిస్తున్నాయని వాటి సారాంశం. అయితే నిర్మాతలు వీటిని కొట్టిపారేయడం లేదు. డీల్స్ వచ్చిన మాట వాస్తవమే కానీ తాము మాత్రం ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని కుండబద్దలు కొట్టేశారు. అది డిసెంబర్ కావొచ్చు లేదా వచ్చే ఏడాది జనవరి కావొచ్చు మొత్తానికి డిజిటల్ లో వచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పారు.
అయితే దీని వెనుక మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. లవ్ స్టోరీ నిర్మాణ సంస్థ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ స్వతహాగా అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్. థియేటర్ చైన్ కూడా ఉంది. మహేష్ బాబు ఏఎంబి సూపర్ ప్లెక్స్ లో కీలక భాగస్వామి. కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది. ఇంత సీనియర్ మోస్ట్ పంపిణీదారుడు తన స్వంత సినిమాను ఓటిటికి ఇస్తే అది మంచి సంకేతం అనిపించుకోదు. తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిన థియేటర్ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుంది. లేనిపోని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎంతో కొంత నష్టమే అయినప్పటికీ హాళ్లు తెరిచే దాకా వేచి చూడాలని డిసైడ్ అయ్యారట. అందులోనూ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఎప్పుడైనా ఓపెనింగ్స్ కి లోటు ఉండకపోవచ్చు.
ఇది ఒకరకంగా మంచి నిర్ణయమే. థియేటర్లు ఎప్పుడు తెరిచినా రెండు నెలలకు సరిపడా కంటెంట్ పరిశ్రమలో ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందులోనూ జనం కరోనా భయం దాటుకుని మరీ టికెట్లు కొనాలంటే వరసగా విడుదలలు ఉండాల్సిందే. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. పబ్లిక్ ఇప్పటికే ఓటిటిలకు బాగా అలవాటు పడినప్పటికీ పెద్ద తెరమీద చూస్తే కలిగే అనుభూతే వేరు కాబట్టి ఎప్పటికైనా పాత రోజులు రావడం ఖాయం. అందుకే నాగ చైతన్య లాంటి ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు స్టాక్ లో ఉండటం చాలా అవసరం. అందులోనూ ఫ్యామిలీలను రప్పించాలంటే శేఖర్ కమ్ముల లాంటి దర్శకులే కరెక్ట్. ఈ లెక్కన లవ్ స్టోరీకి సంక్రాంతి కంటే మంచి సీజన్ దొరక్కపోవచ్చు. పోటీ ఎంత ఉన్నా తెలుగునాట అందులోనూ ఇండస్ట్రీకి ముఖ్యమైన పండగ కాబట్టి అప్పుడు ఫిక్స్ చేస్తారేమో చూద్దాం