లాంఛనం పూర్తయింది. గత టెస్టులో జరిగిన ఘోర పరాభవానికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. తద్వారా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1 తో సమం చేసింది.
99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు కామెరూన్ గ్రీన్, కమిన్స్ కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. 133/6 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో కామరూన్ గ్రీన్(45; 146 బంతుల్లో 5×4), పాట్ కమిన్స్(22; 103 బంతుల్లో 1×4) ఇద్దరూ భారత బౌలర్లను విసిగించారు. దాదాపు 22 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఈ దశలో పాట్ కమిన్స్ ని ఔట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. మరో 8 ఓవర్ల తర్వాత సిరాజ్ బౌలింగ్ లో కామెరూన్ గ్రీన్ జడేజాకి చిక్కాడు. టెయిలెండర్ల పోరాటం వల్ల జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో సిరాజ్ మూడు,అశ్విన్,జడేజా,బుమ్రా రెండేసి వికెట్లను సాధించగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు.
70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), సీనియర్ బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(3) మరోసారి నిరాశపరిచారు. ఈ దశలో ఓపెనర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(35; 36 బంతుల్లో 7×4), కెప్టెన్ అజింక్య రహానె(27; 40 బంతుల్లో 3×4) మరో వికెట్ పడకుండా సంయమనంతో ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
సెంచరీ హీరో అజింక్య రహానేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించడంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1 తో సమం చేసింది. జనవరి 7 నుండి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ ల మధ్య మూడో టెస్టు జరగనుంది.