iDreamPost
android-app
ios-app

రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్ – టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు

రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్ – టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు

9420408401 ఇదేమి మొబైల్ ఫాన్సీ నంబర్ కాదు.. మన టీమిండియా ఆటగాళ్ళు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన మొత్తం పరుగులు.. ఎప్పుడెప్పుడు పెవిలియన్ చేరుకుందామ అన్నట్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆటగాళ్లు తమ అత్యల్ప టెస్ట్ స్కోరును తిరగరాస్తూ 36 పరుగులకే కుప్పకూలింది. 1974 లో ఇంగ్లండ్ పై 42 పరుగుల అత్యల్ప స్కోరును నమోదు చేసిన భారత జట్టు నేటి మ్యాచ్ తో ఆ రికార్డును తిరగరాసింది. టెస్ట్ చరిత్రలో 4వ అత్యల్ప స్కోరును సమం చేసిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది.

9/1 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా మరో రెండు పరుగులు జోడించి నైట్‌వాచ్‌మెన్‌ బుమ్రా వికెట్ ను కోల్పోయింది. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ పేసర్లు విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికలు అయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వకుండా హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ భారత పతనాన్ని శాసించారు. హాజిల్‌వుడ్‌ 5 వికెట్లు సాధించగా, కమిన్స్‌ 4 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 21.2 ఓవర్లలో 36/9 పరుగులు చేసిన స్థితిలో మహ్మద్‌ షమి(0) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్‌ పేసర్ల దాటికి పుజారా, రహానే, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. టీం ఇండియా ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా రెండంకెల స్కోరు సాధించలేదంటే భారత బ్యాటింగ్ తీరు ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు..

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియాకు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు డిన్నర్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ 14 , జో బర్న్స్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు..కాగా భారత ఆటతీరుపై అన్ని వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..