iDreamPost
iDreamPost
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ ఫస్ట్ టైం కాంబోలో రూపొందుతున్న ఫైటర్(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. లాక్ డౌన్ కు ముందు ఆగిపోయిన సినిమాలన్నీ దాదాపుగా సెట్స్ పైకి వెళ్లాయి. నెలల తరబడి వేచి చూసిన ఆచార్య కూడా వేగమందుకుంది. కానీ విజయ్ మూవీ మాత్రం ఇంకా ఇంచు కూడా కదలడం లేదు. ముంబైలో కొంత భాగం షూట్ చేశాక కరోనా వైరస్ కారణంగా మార్చ్ లో హైదరాబాద్ కు తిరిగి వచ్చాక మళ్ళీ టీమ్ అక్కడికి వెళ్లనే లేదు. పూరి మాత్రం రెగ్యులర్ గా వెళ్లి వస్తున్నాడు కానీ అది ఈ సినిమా పనుల కోసమా లేక మరో కారణమా ఇంకా తెలియలేదు.
నిజానికి ఇందులో కొన్ని కీలక భాగాలు బ్యాంకాక్, అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అంతే కాదు ఇక్కడే ప్లాన్ చేసిన షెడ్యూల్స్ లో కూడా విదేశీ ఫైటర్ల ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్చడానికి లేనివి. స్క్రిప్ట్ అలా రాసుకున్నారు. అందుకే ఎంత లేట్ అవుతున్నా అంతర్జాతీయ ప్రయాణాల పరంగా ఇంకా కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో రౌడీ హీరోతో పాటు పూరి కూడా ఎలాంటి రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం జనవరి నుంచి షూట్ కొనసాగించేలా ప్లానింగ్ చేశారట. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
హిందీలోనూ ఫైటర్ ని సమాంతరంగా విడుదల చేయబోతున్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే వచ్చే వేసవిలోనూ రిలీజ్ అవ్వడం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ మధ్య అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇవి కాకుండా ఏదైనా మీడియం బడ్జెట్ లో కూడా విజయ్ దేవరకొండ ఓ మూవీ ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలిసింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపరిచిన నేపధ్యంలో ఆశలన్నీ పూరి మీదే పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చిన పూరి ఇకపై సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలనే గట్టి సంకల్పంతోనే ఉన్నాడు.