మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ లాక్ డౌన్ వల్ల మార్చ్ నుంచి ఆగిపోయిన సంగతి తెలిసిందే . అందరికంటే ముందు బ్రేక్ వేసుకుంది ఈ సినిమానే. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో అంతు చిక్కడం లేదు. కరోనా ఇంకా అదుపులోకి రాని కారణంగా చిరు లాంటి సీనియర్ హీరోలు ఇప్పుడే సెట్ లో అడుగు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఇదిలా ఉండగా ఆచార్య ప్లానింగ్ ఒకరకంగా అయోమయంలో పడింది. కారణాలు ఉన్నాయి. అసలీ కరోనా రాకపోయి ఉంటే రామ్ చరణ్ ఆగస్ట్ కంతా ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకుని నాన్నతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పాల్గొనేవాడు. కాని ఇప్పుడు రాజమౌళికే క్లారిటీ మిస్ అవుతోంది.
కాబట్టి ఫలానా టైంకంతా చరణ్ ని ఫ్రీగా వదిలేస్తా అని ఖచ్చితంగా చెప్పలేరు. దానికి తోడు హీరొయిన్ కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ఇండియన్ కు బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ అది కూడా ఆచార్య టైంలోనే రీ స్టార్ట్ అయితే ఇబ్బందే. డేట్స్ విషయంగా క్లాష్ రాకుండా చూసుకుని దానికి తగ్గట్టే ప్లాన్ చేయాలి. ఇంకోవైపు సోను సూద్ కాల్ షీట్స్ కూడా ఇదే తరహాలో టైట్ గా ఉన్నాయి. ఇవన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పటిదాకా రెండు పాటలే షూట్ చేశారు ఆచార్య కోసం. బాలన్స్ లో రెండు డ్యూయెట్స్ ఉంటాయట. ఇప్పుడీ చిక్కులన్నీ దర్శకుడు కొరటాల శివకు పెద్ద ఛాలెంజ్ గా మారాయని సమాచారం.
మణిశర్మ ట్యూన్స్ రికార్డింగ్ ఇంతకు ముందే పూర్తయ్యింది కాబట్టి సరిపోయింది కాని లేదంటే అదొక తతంగంగా మిగిలేది. ఎలాగూ సంక్రాంతి 2021కి ఆచార్య వచ్చే ఛాన్స్ లేనట్టే. ఇక ఆపై సమ్మర్ సీజన్ ని టార్గెట్ గా పెట్టుకోవాలి. ఇప్పటికే సైరా కోసం మూడేళ్ళు ఆపై ఆచార్య కోసం రెండేళ్ళు ఇలా గడిచిపోవడం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అయినా ఇవన్ని ఊహించని పరిణామాలు కాబట్టి దానికి తగ్గట్టు సర్దుకుని పోవాల్సిందే. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి కొరటాల శివను ఉద్దేశించి త్వరగా సినిమాను పూర్తి చేయమని ఏ ముహూర్తంలో చెప్పారో కాని అక్కడితో మొదలు ఆచార్యకు బ్రేకులు మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి.