iDreamPost
android-app
ios-app

TDP, Chandrababu, BC Federation – బాబు.. ఇక బీసీలను ఉద్ధరిస్తారట!

  • Published Dec 28, 2021 | 7:11 AM Updated Updated Dec 28, 2021 | 7:11 AM
TDP, Chandrababu, BC Federation – బాబు.. ఇక బీసీలను ఉద్ధరిస్తారట!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తీరు. వరుసగా ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడి.. పూర్తిగా కృశించిపోయిన తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టేందుకు నానాపాట్లు పడుతున్న ఆయన.. అందులో సఫలీకృతం కాలేక చివరికి సీఎం జగన్ ఆలోచనలను, కార్యక్రమాలను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అమలుచేస్తున్న కొన్ని కార్యక్రమాలను తన పార్టీకి అన్వయింపజేసుకుని వైఎస్సార్సీపీ మాదిరిగానే ప్రజాదరణ పొందాలని తాపత్రాయపడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్ వ్యవస్థలాగే టీడీపీ తరపున వలంటీర్లను నియమించడానికి ఒకవైపు కసరత్తు చేస్తున్న టీడీపీ.. తాజాగా బీసీ వర్గాలను ఉద్దరిస్తామంటోంది. అందులో భాగంగా కులాలవారీగా బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తారట. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి కాపీయే కావడం విశేషం. 

నిరాదరణతో బీసీలు టీడీపీకి దూరం

రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కులాలవారీగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని ప్రజాసంకల్ప యాత్రలోనే జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 56 బీసీ కులాలను గుర్తించి.. వాటికి రాష్ట్రస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతో బీసీలందరూ వైఎస్సార్సీపీని అక్కున చేర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ గంపగుత్తగా ఓట్లు వేసి ఏకపక్ష విజయాలు అందించారు.

వాస్తవానికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆ పార్టీని బీసీల పార్టీగా తీర్చిదిద్దారు. అందుకు తగినట్లే ఎన్నికల్లో బీసీలు ఆ పార్టీకే అండగా నిలిచేవారు. కానీ చంద్రబాబు పార్టీని హస్తగతం చేసుకున్నాక.. ఆయన తీరుతో బీసీల పార్టీ అన్న ముద్రను ఆ పార్టీ క్రమంగా కోల్పోయింది. ప్రత్యేకించి 2014లో చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత బీసీలను పూర్తిగా విస్మరించి.. వారిపట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దాంతో విసిగిపోయిన ఆ వర్గాలవారు జగన్ హామీలను విశ్వసించి వైఎస్సార్సీపీకి జై కొట్టారు. హామీలకు కట్టుబడి సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో వారంతా పార్టీకి పూర్తిగా కట్టుబడిపోయారు. ఈ పరిణామాలను గుర్తించిన చంద్రబాబు బీసీలను మళ్లీ టీడీపీ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగమే.. బీసీ ఫెడరేషన్ల ఏర్పాటు నిర్ణయం. ఈ మేరకు పది వేలకు పైగా జనాభా కలిగిన 60 కులాలను గుర్తించారు.వాటన్నింటికీ రాష్ట్రస్థాయిలోనూ, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ నాయకులతో ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

Also Read : అర్హులకు నేడు సంక్షేమ లబ్ధి.. నేరుగా రూ. 703 కోట్లు జమ

ఎందుకీ ఫెడరేషన్లు?

ప్రభుత్వం చట్టబద్దంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు, పథకాలు ఇస్తోంది. కానీ చంద్రబాబు పార్టీపరంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఏం చేస్తారన్నది ఆ పార్టీ వర్గాలకే అంతుచిక్కడంలేదు. పార్టీకి అనుబంధంగా ఇప్పటికే ఉన్న బీసీ సెల్ ను నామమాత్రంగా మార్చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఫెడరేషన్ల పేరుతో హడావుడి చేస్తుండటంపై ఆ పార్టీ బీసీ నేతలే పెదవి విరుస్తున్నారు. పార్టీ పరంగా సమస్యలు తెలుసుకోవడం తప్ప ఇంకేం చేయగలమని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. గతంలో అండగా ఉన్న బీసీలను నిరాదరించి దూరం చేసుకున్న అనుభవాల నేపథ్యంలో ఫెడరేషన్ల పేరుతో పార్టీలో నాయకులను పెంచి అంతర్గత పోటీ పెంచడం తప్ప ఫెడరేషన్లతో కొత్తగా ఉద్దరించేది ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.