iDreamPost
iDreamPost
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించి.. వారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని టీడీపీ అధిష్టానం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. అయితే చాలా అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాలకు సరైన నేతలు లభించక.. కొన్ని చోట్ల నేతలు ఉన్నా ఇంఛార్జి బాధ్యతలు మోసేందుకు ముందుకు రాకపోవడంతో ఇప్పటికీ చాలా నియోజకవర్గాలు ఖాళీగానే ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల తాత్కాలికంగా ఛోటా నేతలకు బాధ్యతలు కట్టబెట్టారు. అటువంటి వాటిలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. ప్రతిష్టాత్మక పోటీ జరిగే బలమైన నియోజకవర్గాల్లో ఒకటైన రాజమండ్రికి గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరులో పోటీ చేసి ఓటమి పాలైన మాజీమంత్రి కె.ఎస్. జవహర్ ను తీసుకొచ్చి ఇంఛార్జిగా పెట్టడంపై టీడీపీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
Also Read : కేశినేని కాకుంటే మరెవరు?
తప్పుకున్న మురళీమోహన్ కుటుంబం
గత కొన్ని ఎన్నికల నుంచి వరుసగా రాజమండ్రి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2014 ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. తర్వాత అనారోగ్యానికి గురికావడంతో.. ఆయన కోడలు రూపాదేవి చక్రం తిప్పారు. 2019 ఎన్నికల్లో మురళీమోహన్ పోటీకి అయిష్టత చూపి తప్పుకోవడంతో రూపాకే ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె కొన్నాళ్లు టీడీపీ రాజకీయాల్లో చురుగ్గానే వ్యవహరించారు. అయితే మురళీమోహన్ ఆమెను కూడా రాజకీయాల నుంచి తప్పించి.. కుటుంబ వ్యాపార బాధ్యతలు అప్పగించడంతో రూప కూడా రాజమండ్రికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో వేరే నాయకులు దొరక్క మాజీమంత్రి జవహర్ ను రాజమండ్రి పార్లమెంటు ఇంఛార్జిగా చంద్రబాబు నియమించారు.
Also Read : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ …?
దిగజారుతున్న పరిస్థితి
గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు సీటును కోల్పోయిన టీడీపీ దాని పరిధిలోని రాజామండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గెలిచింది. మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ పుంజుకోలేదు. రూరల్, సిటీ నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి దిగజారింది. పార్టీ సీనియర్ నేత, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా అంటున్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చాన్నాళ్లుగా క్రియాశీలంగా లేరు. మరోవైపు గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు ఇంఛార్జిగా సమర్ధుడైన నేత అవసరమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ప్రస్తుతం ఇంఛార్జిగా ఉన్న జవహర్ ఏ మాత్రం సరిపోరని వ్యాఖ్యానిస్తున్నారు. సమర్ధుడైన సీనియర్ నేతను గానీ, కొత్తవారిని గానీ ఇంఛార్జిగా నియమించాలని కోరుతున్నారు.
Also Read : చేతులు కలిపిన నాని- రాధా , టీడీపీ గుండె జారి గల్లంతయ్యిందే