విజయవాడ టిడిపి అంతర్గత వివాదాలు బహిరగం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు పుణ్యమా అని ఎంపీ కేశినేని నానికు, ఇతర నేతలకు పొడచూపిన విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. శనివారం మరోసారి విజయవాడ మధ్య నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎంపీ కేశినేని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బహిరంగ వేదిక మీదే చంద్రబాబుకు సవాల్ విసిరారు. పార్టీ అధినేతకు విజయవాడ రాజకీయాల మీద అల్టీమేటం జారీ చేయడం విశేషం.
శ్వేతకు ఇచ్చిన తర్వాత ఎందుకీ రచ్చ!
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిత్వం మీద వివాదం రాజుకుంది. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థి చేసే విషయం తో పాటు, 39 వ డివిజన్ టిడిపి అభ్యర్థి మార్పు విషయంలోనూ టిడిపిలో అంతర్యుద్ధం మొదలైంది. ఎంపీ కేశినేని లక్ష్యంగా విజయవాడ టీడీపీ నేతలంతా ఆయన తీరు మీద రచ్చకెక్కరు. దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించి నేతలతో మాట్లాడిన తీరులో మార్పు కనిపించలేదు. తాజాగా రెండు రోజుల క్రితం ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను టిడీపి మేయర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ విషయంలో కేసినేని నాని తన పంతం నెగ్గించుకున్నారు అని భావిస్తున్న మిగిలిన నేతలు ఇప్పుడు స్వరం పెంచారు.
బుద్ధా, బోండా ఒక్కటై!
విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మధ్య నియోజకవర్గానికి చెందిన బోండా ఉమా తమ ఉమ్మడి శత్రువుగా ఎంపీ కేశినేని భావిస్తున్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. శనివారం మధ్య నియోజకవర్గ ఎన్నికల సభలో బోండా ఉమ మాట్లాడుతూ కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీలో చేసిన కొన్ని కార్యకలాపాల వల్ల ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డ రని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కు తగులుకున్నాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు విజయవాడ టిడిపిలో ఎంపీ కేశినేని నాని కావాలా.. మేము కావాలా అన్నది చంద్రబాబు తేల్చుకోవాలి అంటూ సవాల్ విసరడం ఎప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. బొండా ఉమా ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంతోనే ఇలా మాట్లాడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల వివాదాన్ని కొనసాగించడానికే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది ఆ పార్టీ నాయకుల మాట. దీని వెనుక బోండా ఉమాను నడిపిస్తుంది కూడా చంద్రబాబే అన్నది, కేశినేని నాని కుటుంబానికి మేయర్ అభ్యర్థిత్వం దక్కడం చంద్రబాబుకే ఇష్టం లేదని, కాబట్టే పార్టీ నాయకులతో ఇలాంటి రాజకీయం మొదలు పెట్టారని, ఎలాంటి దన్ను లేకుండా బొండా ఉమా ఇలాంటి సవాల్ విసరడం అనేది అసాధ్యం అన్నది విశ్లేషకుల మాట.
ఎంపీ కు ఇచ్చే మర్యాద ఏది?
2019 లో విజయవాడ లోక్సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయినా లోక్సభ స్థానాన్ని సాధించిన కేశినేని నానికి మొదటి నుంచి బెజవాడ టిడిపి నేతలు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తామే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలపై కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి సమావేశాలకు సైతం కేశినేని నాని ను పిలవడం లేదు. దీంతో లోక్సభ ఎన్నికలు వచ్చే సమయంలో కనీసం పార్టీ కేడర్, నాయకులు ఎవరు అన్నది కూడా కేశినేని నాని తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క ఎంపీ కు ఓటు వేయాలని, నియోజకవర్గ టిడిపి నేతలు కోరడం లేదు. ఎన్నికల సమయంలో ఎంపీగా మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ కేసినేని నాని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది గత రెండు ఎన్నికల్లోనూ నానీకు అనుభవమే. దీంతోనే బెజవాడ టిడిపి రాజకీయాల్లో పట్టుకోసం నాని ప్రయత్నిస్తున్నారు. దీనిని ఆయా నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే ఇరుపక్షాలకు మధ్య స్పర్ధాలు వస్తున్నాయి. కూర్చోబెట్టి చెప్పాల్సిన టీడీపీ అధినేత మరింత దీనిలో మరింత ఆజ్యం పోస్తున్నారు తప్పితే వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం లేదు. ఫలితంగా బెజవాడ టిడిపి రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు వివాదాల సుడిగుండం రేగుతూనే ఉంది.