iDreamPost
iDreamPost
వైఎస్సార్ సీపీ నేతలు తెలుగు భాషను బూతులమయంగా చేసేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అనడం గురివింద తన నలుపు ఎరుగదు అన్నట్టు ఉంది. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలకు తెలుగు తరగతులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు. శాసనసభను కౌరవ సభగా మార్చారని ఆరోపించారు. ఈ దుష్ట సంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు తీసుకెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. సిగ్గుమాలిన చర్యలకు వైఎస్సార్ సీపీ ప్రతీకగా మారిందన్నారు. పార్లమెంట్‌లో బూతులు మాట్లాడిన ఆ పార్టీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.
ముందు మీ పార్టీ నేతలకు నేర్పండి..
తెలుగు భాషపై అధికార పార్టీ నేతలకు తరగతులు బోధిస్తానంటున్న వర్ల వారు ఆ బోధన ఏదో తమ తెలుగుదేశం పార్టీ నాయకులకు చేస్తే బావుంటుందన్న సూచనలు వైఎస్సార్ సీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. బూతులు మాట్లాడడంలో ఉత్తరాంధ్ర మొత్తానికి పేటెంట్ తీసుకున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొత్త బూతులను కనిపెట్టి మరీ తిడుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, అసెంబ్లీలోనే అరేయ్.. ఒరేయ్ అని సంబోంధించిన బోండా ఉమా, బూతులు తిడుతూ ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అసలు తెలుగే సరిగా మాట్లాడడం రాని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వంటి వారికి ముందుగా తెలుగులో తరగతులు బోధిస్తే బావుంటుందని అంటున్నారు.
జనం నమ్ముతారనుకుంటున్నారా?
శాసన సభను కౌరవ సభగా మార్చేశారని తరచూ వ్యాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీని అవమానిస్తున్నాం అన్న సంగతిని మరచిపోతున్నారు. ఆ రోజు ఎవరూ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని నిందించలేదు. శాసనసభ రికార్డుల సాక్షిగా ఇది నిజం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఇప్పటికే విస్పష్టంగా చెప్పారు. జరగని ఒక అంశాన్ని ఇప్పటికీ ప్రస్తావిస్తూ కౌరవ సభ అనడమే కాకుండా పార్లమెంట్‌లో సైతం వైఎస్సార్ సీపీ ఎంపీలు బూతులు మాట్లాడారని అడ్డుగోలు మాట్లాడడం వర్లకే చెల్లింది. నిబంధలను విరుద్ధంగా అసెంబ్లీ కార్యక్రమాలను తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ అధినేత భార్యను వైఎస్సార్ సీపీ నేతలు నిందించినట్టు గాని, బూతులు మాట్లాడినట్టుగాని వీడియోలు ఉంటే ఎందుకు బహిరంగ పరచరు? నిజంగా అలా జరిగి ఉంటే తమ పచ్చ మీడియాలో ఎంత రచ్చ చేసేవారు. వంక లేనమ్మ డొంక పట్టుకు ఏడ్చిందన్నట్టు అధికార పార్టీని ఏ అంశంపై విమర్శించాలో చేతకాక శాసన సభను కౌరవ సభగా మార్చేశారు…బూతులు మాట్లాడుతున్నారు… అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా తరచు మాట్లాడితే జనం నమ్మేస్తారని వీరి లాజిక్. అయితే టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదని, వీరిది ఏడుపు గొట్టు రాజకీయం అని జనం ఎప్పుడో గమనించేశారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో లైవ్ చూడడమే కాక, సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు టీడీపీ నాటకం వెల్లడి అయింది.
అయినా జనం జ్ఞాపకశక్తిపై చులకన భావం ఉన్న తెలుగుదేశం నేతలు పాత పాటనే పాడుతున్నారు. అధికారం ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారంటున్న వర్ల రామయ్య చెప్పింది నిజమే! గతంతో అధికార గర్వం తలకెక్కి విచ్చలవిడిగా ప్రవర్తించారు కనుకనే తెలుగుదేశం పార్టీకి ప్రజలు 2019 ఎన్నికల్లో వాతలు పెట్టారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.