iDreamPost
android-app
ios-app

ఠాట్‌..ఇంత బాధ్యతారాహిత్యామా..? సీబీఐ పనితీరుపై వర్ల రామయ్య అసంతృప్తి

ఠాట్‌..ఇంత బాధ్యతారాహిత్యామా..? సీబీఐ పనితీరుపై వర్ల రామయ్య అసంతృప్తి

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ ఏ మాత్రం సరిగా లేదు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ ఆ సంస్థ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. బెయిల్‌ రద్దు కోరకపోయినా కనీసం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేలా వైఎస్‌ జగన్‌ను ఆదేశించాలని సీబీఐ కోరి ఉండాల్సి ఉంది. ఏదీ చేయకుండా కోర్టు ఇష్టమని చెప్పడం సీబీఐ బాధ్యతారాహిత్యమే.. ఈ మాటలన్ని ఎవరో కాదు వర్ల రామయ్య. ఇదేమిటి సీబీఐ పని తీరును వర్ల రామయ్య తప్పుబడుతున్నారు..? ఇటీవల జరిగిన నియామకాల్లో సీబీఐ డైరెక్టర్‌గా వర్ల రామయ్య ఏమైనా నియమితులయ్యారా..? అనే సందేహాలు ఈ వ్యాఖ్యలు విన్న వారికి రాకుండా పోవు. కానీ వర్ల రామయ్య టీడీపీ నేతే.

టీడీపీ నేతల్లో నిరాశ..

పైన పేర్కొన్న వ్యాఖ్యలను చదవిన తర్వాత.. వర్ల రామయ్య ఎందుకు సీబీఐని తప్పుబట్టారు..? బాధ్యతారాహిత్యమంటూ విమర్శించారనేది ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు పని చేయాలనే ఉద్దేశం.. వర్ల రామయ్య వ్యాఖ్యలలో కనిపిస్తోంది. బెయిల్‌ రద్దు చేయకపోయినా.. కనీసం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ కోరి ఉండాల్సిందంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించిన మాటల్లో నిరాశ కనిపిస్తోంది. ఇవేమి అడగకుండా.. మీ ఇష్ట ప్రకారం చేయడంటూ సీబీఐ ఎలా చెబుతుందనేలా వర్ల వ్యాఖ్యలున్నాయి.

విమర్శలే కాదు.. దిశానిర్ధేశాలు కూడా..

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురాము రాజు పిటిషన్‌ దాఖలు చేయడమే విడ్డూరం. ఆ పిటిషన్‌ ఆధారంగా సీబీఐ కోర్టు జగన్‌ బెయిల్‌ రద్దు చేస్తుందని టీడీపీ నేతలు ఆశలు పెట్టుకోవడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్‌పై ఫిర్యాదు చేసిన వారిలోగానీ, ఆయా కేసులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎలాంటి సంబ«ంధం లేని రఘురామరాజు పిటిషన్‌ దాఖలు చేస్తే.. అతని పిటిషన్‌ను సమర్థించేలా.. కౌంటర్‌ వేయాలంటూ వర్ల రామయ్య సీబీఐ నుంచి ఆశించడం విశేషం.

రఘురామరాజు పిటిషన్‌ ద్వారా తాము అనుకున్నది నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న వర్ల రామయ్య.. ఆ ఫ్రస్ట్రేషన్‌ను సీబీఐపై చూపడం హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ కౌంటర్‌ను తప్పుబట్టడం, బాధ్యతారాహిత్యమంటూ నిందించడం, సీబీఐ ఎలా పని చేయాలో డైరెక్ట్‌ చేయడం.. వర్ల రామయ్య తన స్థాయిని భారీగా ఊహించుకుంటున్నట్లుగా ఉంది. ఓ డీఎస్పీ స్థాయి మాజీ అధికారి అయిన వర్ల రామయ్య సీబీఐ ఎలా పని చేయాలి..? ఎలా చేయకూడదో.. డైరెక్ట్‌ చేస్తుండడం విచిత్రంగా ఉంది.

Also Read : జగన్‌పై కేసులు.. సీబీఐ విచారణను శంకిస్తున్న లోకేష్‌..!