iDreamPost
android-app
ios-app

TDP Varla Ramaiah – నోటీసులపైనా పచ్చ ప్రేలాపన..!

  • Published Oct 15, 2021 | 5:07 AM Updated Updated Oct 15, 2021 | 5:07 AM
TDP Varla Ramaiah – నోటీసులపైనా పచ్చ ప్రేలాపన..!

డ్రగ్స్ వ్యవహారంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ జారీ చేసిన లీగల్ నోటీసులపై సైతం టీడీపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవి చిత్తు కాగితాలతో సమానమని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పందించగా, తాజాగా అర్థం పర్థం లేని ఆరోపణలతో వర్ల రామయ్య ఎదురుదాడికి దిగారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున పట్టుబడ్డ డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు శాఖ పదే పదే స్పష్టంగా చెప్పినా అదే పనిగా అబద్దపు ఆరోపణలు చేస్తూ, ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్న చంద్రబాబుకు, కొందరు టీడీపీ నేతలకు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు డీజీపీ లీగల్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేతగా నోటీసులకు బాధ్యతాయుతంగా స్పందించడానికి బదులు తన పార్టీ నేతలతో చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయిస్తున్నారు.

సీఎం, మంత్రులే స్పందించాలట!

తాము చేసినవి రాజకీయ వ్యాఖ్యలని, వాటికి ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించాలి కాని డీజీపీ నోటీసులు ఇవ్వడం ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. తాము చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే డీజీపీ నోటీసులు ఇస్తే మాత్రం అభ్యంతరం ఎందుకు? రాజకీయ వ్యాఖ్యలంటే ఏ మాత్రం బాధ్యత లేకుండా నోటికి ఏమి వస్తే అది మాట్లాడతారా? దానికి సీఎం, మంత్రులు మాత్రమే సమాధానం ఇవ్వాలా? ఇదేం లాజిక్కు? తప్పుడు ఆరోపణలతో రాష్ట్రం పరువు తీయొద్దని డీజీపీ విజ్ఞప్తి చేస్తే ఆయనపై సైతం వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాక మొత్తం పోలీసు వ్యవస్థను దోషులుగా చిత్రీకరించేలా చేసిన వ్యాఖ్యలను కూడా రాజకీయ విమర్శగానే పరిగణించాలా? పెదబాబు నుంచి చినబాబు వరకు ఉన్న నేతలంతా తమ నోటి తీటకు పనిచెప్పి రాష్ట్రం డ్రగ్స్ వల్ల మత్తు ఆంధ్రగా మారి పొయిందని, సీఎం దీనికి సూత్రధారని వ్యాఖ్యానించడం ఒట్టి రాజకీయ వ్యాఖ్యగా ఎవరైనా భావిస్తారా? జనంలో ప్రభుత్వాన్ని పలుచన చేయాలనే రాజకీయ కుట్రకు పెద్ద ఎత్తున తెరలేపి తీరా వ్యవహారం నోటీసుల వరకు వచ్చేసరికి ఇలా రాజకీయంగా స్పందించడం ఏమిటో?

Also Read : ABN Andhra Jyothi : బాబు – రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ

సాక్ష్యాలు అడగడం తప్పేనా..

హెరాయిన్ కింగ్ పిన్ ఆఫీసు విజయవాడలో ఉందని చేసిన ఆరోపణకు సాక్ష్యాలు ఇవ్వండి అని డీజీపీ అడగడం కూడా తప్పు అన్నట్టు
మాజీ పోలీసు అయిన వర్ల వ్యాఖ్యానించడం విడ్డూరం. వీరు చేసిన ఆరోపణలపై డీజీపీ విచారణ చేయాలే తప్ప సాక్ష్యాలు అడగకూడదట. అంటే తమ ఆరోపణలకు ఆధారాలు లేవని పరోక్షంగా ఒప్పుకుంటున్నారా. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఐవరీకోస్ట్‌కు వెళ్లారని, దానికి కారణం డ్రగ్స్ మాఫియాతో సంబంధమేనని టీడీపీ నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణ. ఐవరీకోస్ట్‌కు, ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉన్న సంబంధాలేమిటో పోలీసులు ఏనాడైనా విచారించారా?, ఐవరీకోస్ట్ లో ఎమ్మెల్యే ద్వారంపూడి గోడౌన్లు కడుతున్నది నిజమేనా? అని ప్రశ్నించారు. వీరు ఏ మాత్రం బాధ్యత లేకుండా, కనీస ఆధారాలు చూపకుండా చేసే ఇలాంటి రాజకీయ విమర్శలపై పోలీసులు దర్యాప్తు చేయాలట. లేదంటే పోలీసులు అధికార పార్టీ తొత్తులని విమర్శలు గుప్పించేస్తారు.

ఇదే తరహా ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన తనయుడు లోకేశ్ పై వచ్చాయి. సింగపూర్, మలేషియాల్లో బాబు కుటుంబం అక్రమాస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయని, అక్కడి వ్యవహారాలు చక్కబెట్టడానికి తరచు వీరు ఆ దేశాలకు వెళుతున్నారని విమర్శలు వచ్చాయి. వాటిపై తమ ప్రభుత్వ హయాంలో పోలీసు విచారణ ఎందుకు జరిపించలేదు. ఒక్క ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అని కాదు చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, సామాన్యులు సైతం విదేశాలకు వెళ్లి వస్తుంటారు. అలా వెళ్లి రావడానికి అనుమతులు తీసుకునే ప్రక్రియ ఉంటుందని, దానికి ఓ వ్యవస్థ ఉందన్న విషయం టీడీపీ నేతలకు తెలియదా? చంద్రశేఖరరెడ్డిపై వీరి ఆరోపణలకు ఆధారాలు ఉంటే సంబంధిత వ్యవస్థలకు అందించాలే తప్ప రాజకీయ విమర్శలు చేయడం విజ్ఞత అనిపించుకుంటుందా?

Also Read : CBN Power Cuts: మీ హయాంలో చీకటి రోజులు మరచిపోయారా బాబు !

అవకాశం వినియోగించుకో రేమి?

సంక్షోభంలోనే అవకాశాలు సృష్టించుకోవాలని చంద్రబాబు తరచు అంటుంటారు. డీజీపీ జారీచేసిన లీగల్ నోటీసులు నిజంగా వారికి గొప్ప అవకాశం. ఇన్నాళ్లూ తాము చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించడానికి చక్కని వేదిక దొరికింది. దాన్ని వినియోగించుకోవచ్చు. అలా కాకుండా ఇలా నోటికి పనిచెబితే జనం ఏమనుకుంటారు? టీడీపీ నేతల ఆరోపణలు కేవలం ప్రభుత్వాన్ని చులకన చేయడానికి చేసిన విమర్శలుగా పరిగణిస్తారు. అప్పుడు చులకన అయ్యేది ప్రభుత్వం కాదు ప్రతిపక్షం, టిడిపి అనుకూల మీడియానే?