iDreamPost
android-app
ios-app

ప్రజల అందోళనా..? మన ఆందోళనా..?

ప్రజల అందోళనా..? మన ఆందోళనా..?

నా బాధ ప్రపంచం బాధ అని చలం అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల తీరు. అమరావతిపై వారు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు, ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతోంది.

ఏపీ రాజధానిని కేంద్ర జాబితాలో చేర్చాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తాజాగా లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పని చేస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతే ఉండాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ రాజకీయాలు చేస్తోంది. గత డిసెంబర్‌లో మూడు రాజధానుల అంశం ప్రతిపాదించడంతో మొదలైన టీడీపీ నేతల అమరావతి రాజకీయం కొనసాగుతూనే ఉంది.

అమరావతి ఉద్యమాన్ని మొదలుపెట్టిన టీడీపీ.. ప్రారంభంలో 29 గ్రామాల్లో నిరసనలు చేపట్టింది. అమరావతి జేఏసీని ప్రారంభింపజేసి రోజు ఏదో ఒక రూపంలో నిరసన చేపడుతూనే ఉన్నారు. చంద్రబాబు జోలే పట్టి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేయాలని చూసినా సాధ్యం కాలేదు. జూమ్‌ మీటింగ్‌ల ద్వారా పదే పదే.. అమరావతి అందరిదీ.. ఉద్యమం చేయండి అంటూ పిలుపులు ఇచ్చారు. అయినా ప్రజల్లో స్పందన లేదు. అయినా పట్టువిడువకుండా అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరిదీ అనే విషయాన్ని ప్రజల్లో జొప్పించాలని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇందులో భాగంగానే.. గల్లా జయదేవ్‌ తాజాగా లోక్‌సభలో.. అమరావతిని మార్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారనివాపోయారు. మరి ప్రజలందరూ ఆందోళనతో ఉంటే.. అమరావతి ఉద్యమం కనీసం రాజధాని ప్రాంతమైన 29 గ్రామాల్లోనూ ఎందుకు జరగడం లేదన్నదానికి టీడీపీ నేతల వద్ద సమాధానం ఉండదు. అమరావతి ఉద్యమం ప్రస్తుతం నాలుగైదు గ్రామాలకే పరిమితమై విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినా.. కూడా టీడీపీ నేతలు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉండడం విశేషం.