iDreamPost
android-app
ios-app

కాకినాడలో మేయర్ పీఠం కోల్పోనున్న టీడీపీ

  • Published Sep 12, 2021 | 2:32 AM Updated Updated Sep 12, 2021 | 2:32 AM
కాకినాడలో మేయర్ పీఠం కోల్పోనున్న టీడీపీ

కాకినాడ కార్పొరేషన్ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి అంతా రెడీ అయింది. ఆమెను పదవి నుంచి తప్పించడానికి ఇన్నాళ్లు అడ్డు వచ్చిన సాంకేతిక ఇబ్బంది తొలగిపోవడంతో ఈ నెల 15వ తేదీ దాటాక అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి కార్పొరేటర్లు సిధ్ధం అవుతున్నారు. నాలుగేళ్ల పాటు అవిశ్వాస తీర్మానం చేయకూడదనే మునిసిపల్ చట్టంలోని నిబంధన ఇన్నాళ్లు ఆమె పదవిని కాపాడింది.

భర్త పెత్తనంతో అసలుకు ఎసరు

టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన మేయర్ పావని భర్త సుంకర తిరుమలకుమార్ పాలనలో విపరీతంగా జోక్యం చేసుకోవడం కార్పొరేటర్లలో అసంతృప్తికి కారణమైంది. ఏకపక్ష నిర్ణయాలు, కనీస విలువ ఇవ్వకపోవడం వంటి చర్యలతో వారు విసిగిపోయారు. అందుకే గత నెలలో జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటు వేసి తమ అసమ్మతిని బాహాటంగా తెలియజేశారు. దీనికితోడు మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు , తిరుమలకుమార్ కు ఉన్న వర్గ పోరు కూడా ఈ పరిస్థితికి దారితీసింది. వర్గపోరుకు కారణం ఇదే.. మేయర్ పావనిని తెలుగుదేశం కాకినాడ పార్లమెంటరీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానవర్గం నియమించింది. దీనికితోడు కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలకుమార్ 2024 ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ కోసం మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొండబాబుతో పోటీ పడుతున్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే కీలకం. అందుకే పార్టీ కూడా ఈ ఇద్దరికీ ప్రాధాన్యం ఇస్తోంది.

కొండబాబుకు ఆగ్రహం..

తనకు పోటీగా తయారవుతున్న తిరుమల కుమార్ కు చెక్ పెట్టేందుకు కొండబాబు పార్టీ కార్పొరేటర్లను తన వైపునకు తిప్పుకొనేందుకు పావులు కదిపారు. అయితే అప్పటికే వీరిద్దరి వర్గపోరుతో నలిగిపోయిన మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లకు నిధుల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడం, వారు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడం వారిని ఆకట్టుకుంది. దీంతో టీడీపీకి చెందిన 32 మందిలో 22 మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా మారిపోగా 9మంది కొండబాబు వర్గంగా మిగిలారు. దీంతో మేయర్ కు మద్దతిచ్చేవారు కరువయ్యారు.

15 దాటాక నోటీసు ..

కార్పొరేషన్లో మొత్తం 50 స్థానాలకు కోర్టు కేసుల కారణంగా రెండు చోట్ల ఎన్నికలు జరగలేదు. 48 స్థానాలకు తెలుగుదేశం 32 చోట్ల గెలిచింది. 2017 సెప్టెంబర్ 16న పావని మేయర్ అయ్యారు. ఈ నెల 15వ తేదీకి ఆమె బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి అవుతాయి. 15 దాటాక రె రెండు. మూడు రోజుల్లో కలెక్టరుకు అవిశ్వాస నోటీసు ఇవ్వవచ్చు.

లెక్కలివీ..

ముగ్గురు మృతి చెందడం, ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మూడు ఎక్స్ అఫీషీయో ఓట్లు ఉన్నాయి. దీంతో మొత్తం ఓట్లు 47 అవుతాయి. అందులో సగం సభ్యులు అంటే 24 మంది సంతకాలు చేసి నోటీసు ఇవ్వాలి. వారు నోటీసు ఇచ్చిన నెల రోజుల్లో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తారు. సభ కోరం పూర్తి కావాలంటే 31 మంది సభ్యులు హాజరు కావాలి. హాజరైన వారిలో సగం కన్న ఒక్క ఓటు ఎక్కువగా అవిశ్వాసానికి మద్దతుగా వస్తే మేయర్ రాజీనామా చేయాలి.