iDreamPost
android-app
ios-app

టీడీపీ ఇక ఆంధ్రా పార్టీయే?

టీడీపీ ఇక ఆంధ్రా పార్టీయే?

తెలంగాణ‌లో టీడీపీకి ఆంధ్రా పార్టీ అనే ముద్ర ఎప్పుడో ప‌డింది. ఆ విష‌యాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డంతో గులాబీ బాస్ కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు. రాను రాను తెలంగాణ‌లో టీడీపీకి దిక్కే లేకుండా పోయింది. కొన్నేళ్ల నుంచి తెలంగాణ టీడీపీకి అన్నీ తానై వ్యవహరించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.. తన పదవికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. 30 ఏళ్లుగా ఆ పార్టీతో కొనసాగిన ఆయన.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు పంపిన లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఆయన.. ఇప్పటికైనా పార్టీ మారి మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్ప‌టికే టీడీఎల్పీ కూడా టీఆర్ఎస్ లో విలీన‌మైంది. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ఇక కేవ‌లం ఆంధ్రాలోనే మిగిలింద‌ని చెప్పొచ్చు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతానికి కాస్తో, కూస్తో టీడీపీ నేత‌లుగా తెలిసిన పేర్లు న‌లుగైదుగురే ఉన్నారు. పొలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేతలు కొత్తకోట దయాకర్రెడ్డి, అరవిందకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి మాత్ర‌మే ఉన్నారు. వీరు కూడా ఉంటారా, ఉండ‌రా అంటే ప్ర‌స్తుత తెలంగాణ రాజ‌కీయాల ప‌రిస్థితుల్లో అనుమాన‌మే. ఉంటే క‌నుక‌, వీరిలో ఒక‌రికి తెలంగాణ టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంది. అయితే, ఎవరు అధ్యక్షుడిగా ఎంపికైనప్పటికీ.. తెలంగాణలో పతనం దిశగా సాగుతున్న టీడీపీకి పూర్వ వైభవాన్ని తేవడమంటే తలకు మించిన భారమే. దాదాపు అసాధ్య‌మే.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కాక మీదున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాంగ్రెస్ ప‌గ్గాలు రేవంత్ చేతిలోకి రావ‌డంతో ఆయ‌న కూడా గ‌ట్టి పోటీ ఇచ్చేలా వేడి పుట్టిస్తున్నారు. కొత్త‌గా వైఎస్ ష‌ర్మిల కూడా పార్టీ ప్రారంభించారు. ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపారు. కేసీఆర్ పై ప‌దునైన వ్యాఖ్య‌లు చేస్తూ 2024 నాటికి బ‌లోపేతం అవుతామ‌ని బ‌లంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలతో పోలిస్తే తెదేపా పరిస్థితే ఆగమ్యగోచరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా నిలిచిన టీఆర్ఎస్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకే జనాలు పట్టం కట్టారు.

మరోవైపు టీడీపీ ఆంధ్రా పార్టీ అనే ముద్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుచేశారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. మరోవైపు గతేడాది కాస్తో కూస్తో పట్టు ఉన్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎలక్షన్లలోనూ టీడీపీకి ఘోర పరాభవమే మిగిలింది. ఇవన్నీ ఆ పార్టీని పాతాళం దిశగా నడిపించాయి. ఇక ఇప్పుడేమో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణ రాజీనామాతో ఆ పార్టీకి ఇక్కడ మనుగడ కష్టమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అక్క‌డ దుకాణం మూసేయ‌డ‌మే మంచిద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.