iDreamPost
iDreamPost
తణుకు మాజీ తెలుగుదేశం శాసన సభ్యులు యలమర్తి తిమ్మ రాజా “వైటీ రాజా” (69) తీవ్ర అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా మహమ్మారి బారిన పడినా ఆ వైరస్ ను జయించారు. కానీ 10రోజుల తరువాత తిరిగి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి దిగజారడంతో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.
ఆంధ్ర సుగర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ తరపున రెండు పర్యాయాలు తణుకు శాసన సభ్యులుగా చేసిన ముళ్లపూడి హరిస్చంద్రప్రసాద్ చిన్న అల్లుడైన వైటీ రాజా ఆయన రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేశారు . తెలుగుదేశం పార్టీ తరుపున 1999లో తణుకు ఎమ్మెల్యేగా గెలిచిన వైటీ రాజా. 2004 ,2009 ఎన్నికల్లో బాపినీడు, కనుమూరి వెంకట నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యరు. వరసగా రెండు పర్యాయాలు ఓటమిపాలవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో టిక్కెట్టు దక్కించుకోలేకపొయారు. ఆయన తణుకు కన్జ్యూమార్ స్టోర్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజా సొంత చెల్లెలని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ వివాహం చేసుకున్నారు. అటు సినీరంగంలో ఇటు రాజకీయ రంగంలో ప్రముఖులతో దగ్గర బందుత్వాలు ఉన్న వైటీ రాజా మరణ వార్త తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.