Idream media
Idream media
అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడింది లేదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన ఏడాదికే మారిన మనిషినని నిరూపించుకున్నాడు. కానీ ఇప్పుడు టీడీపీతో పాటు సీపీఐ నేతలు కలిసి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారని, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని అంటున్నారు. తనకు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తానని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత జగన్ చెప్పడం వాస్తవమే. జగన్ అడిగిన దాని కంటే 3 సీట్లు తక్కువ ఇచ్చినప్పటికీ బంపర్ మెజారిటీ అందించారు ప్రజలు.
ఇక్కడ వైసీపీతో పాటు, అక్కడ బీజేపీ కూడా బంపర్ మెజారిటీ సాధించింది. ఎవరిపైనా ఆధారపడే పరిస్థితి లేకుండానే అధికార పీఠం ఎక్కింది. ఈ పరిస్థితులను గమనించిన జగన్ అప్పుడే నిజం నిర్భయంగా చెప్పారు. కేంద్రంతో కొట్లాడి హోదా తెచ్చుకునే అవకాశం లేదని, విన్నవించే ఒప్పించాలని పేర్కొన్నారు. అన్నట్లుగానే వ్యూహాత్మంగా ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. నిశ్శబ్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక హోదా జగన్ కావడం లేదంటూ ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పేరుతో కొందరు నాయకులు జట్టుకట్టారు. అయితే, ఆలోచన బాగానే ఉన్నా అందులోని ఉన్న నాయకులను చూస్తేనే వీరి అసలు లక్ష్యంగా ప్రత్యేక హోదా సాధనేనా, బాబును అందలం ఎక్కించాలన్న తపనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను మరోసారి తెరపైకి తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలకు కొందరు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా పోరాటంలో సీపీఐ రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు , కాంగ్రెస్ నేతలు ఉండడం వల్లే అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గతంలో ప్రత్యేక హోదాకు, విభజన హామీల అమలుకు తూట్లు పొడిచిన వారే కనిపించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అన్నీ గుర్తుకు రావడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతల పోరాటం సంగతేమో గానీ, ఎలాగైనా చంద్రబాబును సీఎం తపనతోనే వారు జట్టుకట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.