తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతిసారీ అందులో పశ్చిమగోదావరిది కీలకపాత్రగా ఉండేది. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ జిల్లాలో పట్టు నిలుపుకుంటూ వస్తుండేది. కానీ, ప్రస్తుతం జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకీ తీసికట్టుగా తయారవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచిన నేతలు, ఇప్పుడు కనీసం ఇంటి గుమ్మం సైతం దాటకపోవడం, మరికొందరు నేతలు పార్టీ గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో పార్టీ కేడర్ పూర్తిగా నీరసించిపోతోంది.
చింత చచ్చిన పులుపు…
జిల్లాలోని దెందులూరు నియోజవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ అధికారులు, ఉద్యోగులు, సామాన్యులనే తేడా లేకుండా అందరిపై నోటి, చేతి దురుసులను ప్రదర్శిస్తూ ఉండేవారు. పార్టీలో సీనియర్లను కూడా లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోయేవారు. చంద్రబాబు సైతం చింతమనేని రౌడీ రాజకీయానికి వత్తాసు పలికేవారు. కానీ, టీడీపీ అధికారం కోల్పోవడం, సొంతంగానూ ఓటమి చవిచూడటంతో పోలీసులు ఆయనపై పెండింగ్‌లో ఉన్న 29 కేసులను తిరగతోడారు. ఫలితంగా 66 రోజులు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అయితే జైలు నుంచి ఇంటికెళ్లిన ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. టీడీపీ పిలుపిచ్చిన కార్యక్రమాలకు వరుసగా డుమ్మా కొడుతున్నారు. ఇటీవల జిల్లాలో లోకేశ్ పర్యటించినప్పటికీ చింతమనేని జాడ ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా దుగ్గిరాలలోని ఇంటికే పరిమితమవుతూ అప్పుడప్పుడు పెళ్లిళ్లకు హాజరవడం మినహా నియోజకవర్గంలో సైతం పర్యటించడం లేదు.
అయితే చింతమనేని పోలీసులకు భయపడే సైలంటియ్యారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక దెందులూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య చౌదరి ప్రజల్లో సౌమ్యుడనే ముద్రను సంపాదించుకున్నారు. తాజాగా మంత్రి తానేటి వనితతో కలసి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. పార్టీ కేడర్ పూర్తి ఉత్సాహంలో ఉంది.
మాటే మంత్రం…..
టీడీపీ హయాంలో జిల్లా నుంచి మంత్రులుగా వ్యవహరించిన పితాని సత్యనారాయణ, జవహర్, పీతల సుజాతలు పూర్తిగా సైలంటయ్యారు. పితాని గతంలో తాను నిర్వహించిన శాఖలో అవినీతి ఆరోపణలు, దానికి సంబంధించి కొడుకుపై నమోదైన కేసులతో సతమతమవుతున్నారు. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టలేపోతున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మాజీ మంత్రులు జవహర్, సుజాతలకు నియోజకవర్గాల్లో అసమ్మతి, సొంత భలగం లేకపోవడం మైనస్‌లుగా మారాయి. పార్టీ తమకు అన్యాయం చేసిందనే భావన, ఇతరత్రా కారణాలతో వారు కూడా కిమ్మనడం లేదు.
పార్టీ మారుతారా….
ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేవ్ భలంగా వీయడంతో జిల్లాలో టీడీపీ రెండు సీట్లకే పరిమితమైంది. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజులు గెలుపొందారు. అయితే గత కొంతకాలంగా రామరాజు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా నారా లోక్‌శ్ ఆకివీడు పర్యటనలో రామరాజు పాల్గొనడం గమనార్హం. టీడీపీకే చెందిన మరో కీలక నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం కొంత కాలంగా చడీచప్పుడు చేయట్లేదు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ, వైఎస్సార్‌సీపీలోకి వెళ్లున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని మాగంటి నివాసంపై టీడీపీ జెండాను తొలగించడం ఈ ఊహాగానాలకు భలమిస్తోంది. అయితే ఆయన అనుచరులు మాత్రం పార్టీ మారే అవకాశం గట్టిగా వాదిస్తున్నారు. ఏతావాతా చూస్తే జిల్లాలో ఒక్క నిమ్మల రామానాయుడు మినహా మరెవ్వరూ పార్టీ కాడి మోసేందుకు ముందుకు రావట్లేదు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకీ తీసుకట్టుగా తయారవుతోంది.