Idream media
Idream media
‘సీఎస్‌గా ఎస్వీ సుబ్రమణ్యం తొలగింపు దళితుల ప్రార్థనల విజయమే. ఎల్వీని తొలగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు. టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలని ఏపీ సర్కార్ జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలి.ఇప్పటికైనా వైఎస్ జగన్ హిందూ ముసుగు తీసేని నిజమైన క్రైస్తవుడిగా నిరూపించుకోవాలి’ అనే ప్రకటనలు రెండు మూడు రోజులుగా ఎల్లో మీడియాలో అఖిలభారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు మత్తయ్య పేరుతో ప్రకటనలు రావడం ఆలోచింపజేస్తోంది.
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు జగన్ మత విశ్వాసాల గురించి ఏమన్నారంటే…. ‘వెంకన్న దగ్గర జగన్ నాటకాలు ఆడుతున్నారు. సోనియాగాంధీ, కలాం లాంటి అన్యమతస్తులు వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే జగన్‌కు ఇవేమీ పట్టవు. తన మతం చెప్పుకుని అఫిడవిట్ ఇవ్వడానికి ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు ఆలయాలకు వెళ్లకూడదన్న సంప్రదాయం ఉంది. కానీ జగన్ మాత్రం హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. దేవుడితో ఆటలాడుకునేవారు బాగుపడరు’ అని చంద్రబాబు శాపనార్థాలు పెట్టడాన్ని గమనించండి.
క్రైస్తవ సంఘానికి తానే ఏకైక ప్రతినిధిగా చెప్పుకుంటున్న మత్తయ్య టీడీపీ గూటి చిలుకే అనే విషయాన్ని గుర్తించుకోవాలి. జగన్‌ను క్రైస్తవుడిగా పదేపదే చూపుతూ హిందువులకు దూరం చేయాలనే టీడీపీ ఎత్తుగడలో భాగమే మత్తయ్య రంగప్రవేశమని అర్థం చేసుకోవాలి. ఆరు నెలల క్రితం యుద్ధాన్ని తలపించిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను మతం ప్రాతిపదికన దెబ్బతీసేందుకు కేఏ పాల్‌ను ఓ శిఖండిలా టీడీపీ ప్రజల ముందుకు తెచ్చింది. కానీ టీడీపీ జిత్తులమారి ఎత్తులను పసిగట్టిన ప్రజలు ఎంతో వివేకంతో చెంప చెళ్లుమనిపించారు.
అయినా టీడీపీ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపించలేదు. టీడీపీ ఆలోచనల్లో మార్పు రాలేదనేందుకు మత్తయ్యను మరోసారి ముందుకు తీసుకురావడమే నిదర్శనం. ఇంతకూ ఎవరీ మత్తయ్య… టీడీపీతో అతని సంబంధ బాంధవ్యాలేంటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు నాలుగైదేళ్లు వెనక్కి వెళ్దాం.
2015.మే 31…రెండు తెలుగు రాష్ర్టాలే కాదు…యావత్ భారత్‌దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దినం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ కేసులో నాలుగో నిందితుడే జెరూసలెం మత్తయ్య.
స్టీఫెన్‌తో ముడుపులకు సంబంధించి ముందస్తు చర్చలు జరిపిన రాజకీయ బ్రోకర్‌గా తనను తాను చెప్పుకున్నాడు. ఓటుకు నోటు కేసులో ఇతను నాల్గో నిందితుడు. క్రైస్తవ సమాజంలో కార్యకర్త, అఖిల భారత దళిత క్రిస్టియన్ సంఘాల సమాఖ్య కార్యదర్శిగా తనను పరిచయం చేసుకునే మత్తయ్య…క్రైస్తవుల ఉద్ధారకుడిగా తనదైన శైలిలో మతాన్ని సొమ్ము చేసుకుంటున్నాడనే విమర్శలున్నాయి.
ఓటుకు నోటు కేసులో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నమత్తయ్య విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. దళిత క్రిస్టియన్లతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో స్టీపెన్ అసంతృప్తిగా ఉన్నారన్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని తాము కలిశామని, మీ ఓటు ఎవరికని అడిగామని ఒప్పుకున్నాడు.. ప్రభుత్వానికి వ్యతిరేకమని తమతో చెప్పారని అప్పట్లో తెలిపాడు. తాను కాంగ్రెస్, టీడీపీ వారితో మాట్లాడానని… కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదని మత్తయ్య తెలిపాడు. టీడీపీ తరపున క్రిస్టియన్ సెల్ ప్రతినిధి సెబాస్టియన్ తనతో మాట్లాడాడని… సెబాస్టియన్ మరొకరితో కలసి రేవంత్‌రెడ్డితో చర్చించాడని అంటూ ఓటుకు నోటు వ్యవహారం ఎలా సాగిందో అప్పట్లోనే అతను ప్రపంచానికి చాటి చెప్పాడు. అంతేకాదు రేవంత్‌ను పట్టుకోడానికి దళిత క్రైస్తవుడిని కేసీఆర్ పావుగా వాడుకున్నాడని మతాన్ని ముందుకు తెచ్చాడు.
ఆ తర్వాత 2018, ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టుకు మత్తయ్య తాను అప్రూవర్‌గా మారుతానంటూ అఫిడవిట్ దాఖలు చేశాడు. ఆ అఫిడవిట్‌లో ఏం చెప్పాడంటే… ‘అనుమతిస్తే జరిగిన వాస్తవాలన్నీ స్వయంగా చెబుతాను. ఓటుకు నోటు కేసు నుంచి నాకు విముక్తి కల్పించండి. టీడీపీ-టీఆర్ ఎస్ మధ్య ఓటుకు నోటు వ్యవహారాలు, టెలీఫోన్ ట్యాపింగ్, అన్నీ నాకు ప్రత్యక్షంగా తెలుసు. టీడీపీ, టీఆర్ఎస్‌లు , అవి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వాల నుంచి నేను బెదిరింపులను ఎదుర్కొంటున్నాను. వారి తప్పులను కప్పి పుచ్చుకోడానికి నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి’ అని అఫిడవిట్‌లో జెరూసలెం మత్తయ్య పేర్కొన్నాడు. అంతేకాదు తన కేసు తానే వాదించుకుంటానని కూడా సుప్రీంకోర్టును అభ్యర్థించాడు.
ఇదీ జెరూసలెం మత్తయ్య గొప్ప చరిత్ర. ఆయన గారు తాను క్రిస్టియన్లకు ప్రతినిధినంటూ చేస్తున్న ప్రకటనలు కేవలం జగన్‌పై హిందువుల్లో ద్వేషం భావాన్ని పెంచేందుకేనని స్పష్టంగా అర్థమవుతోంది.
సీఎస్‌గా ఎస్వీ సుబ్రమణ్యం తొలగిస్తే అఖిలభారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మత్తయ్య స్పందించాల్సిన పనేంటి? ఆ వార్తకు కేవలం ఎల్లో మీడియాలో మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఏపీ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎల్వీని తొలగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? ఎల్వీ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, సెక్యులర్ విరుద్ధ, దళిత వ్యతిరేక, క్రైస్తవులపై కక్ష సాధింపు జీవోలు జారీ చేశారని మత్తయ్య విమర్శించాడమా? ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్ అయిన ఎల్వీని ఎలాంటి ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేయడంతో దళితుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, అంబేద్కర్ ఆశయం నెరవేరినట్టు భావిస్తున్నామని మత్తయ్య చెప్పడం, దాన్ని అచ్చేయడానికి మించిన దుర్మార్గమైన ఆలోచన ఏమైనా ఉందా?
మహాభారత కురుక్షేత్రంలో శిఖండి రాజకీయాల గురించి కథల్లో చదువుకున్నాం. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.