iDreamPost
iDreamPost
సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై వాస్తవాలను వెలికి తీయడానికి టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించడం మరీ వింతగా ఉంది. కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ శుక్రవారం గుడివాడలో పర్యటిస్తుందన్నారు. గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయి నివేదికను కమిటీ సేకరించి పార్టీ అధిష్టానానికి అందిస్తుందన్నారు. జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నీతులు అప్పడేమయ్యాయి?
సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు అక్కడ పెద్ద ఎత్తున జూదం జరిగిందని విస్తృత ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు తీరిగ్గా కమిటీ వేయడం నిజంగా విడ్డూరం. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్నాళ్లూ ప్రభుత్వం, మంత్రి కొడాలి నానిపై చేసిన విమర్శలు, ఆరోపణలు కేవలం ఊహగానాలతో చేసినవే గాని.. వారికి అక్కడేం జరిగిందో నిజం తెలియదని అంగీకరించినట్టేగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకపక్క నిజనిర్ధారణ కమిటీని ప్రకటించిన అచ్చెన్నాయుడు అదే నోటితో జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని ప్రవేశపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ విధంగా బాధపడిపోతున్న అచ్చెన్న ఇక కమిటీ వేయడంలో అర్థం ఏముంది? అంటే కమిటీ సభ్యులు ఏమేమి నిజాలు నిర్ధారించాలో ఆయన పరోక్షంగా వారికి సూచించినట్టే కదా!
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆల్‌రెడీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో అసలైన నిజాలు బయటపడతాయనే కంగారుతో వాటికి మసిపూసి మారేడుకాయ చేద్దామనే ఉద్దేశంతోనే టీడీపీ ఈ నిజ నిర్ధారణ కమిటీని నియమించిందని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించడంలో ఆరితేరిన టీడీపీ నాయకులు జనాన్ని పక్కదోవ పట్టిస్తుంటారని, క్యాసినో ఘటనను అడ్డం పెట్టుకొని మళ్లీ అదే తరహా ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నాయకులు తమ పార్టీ పాలనలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజా సంఘాలు ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించిన టీడీపీ నేతలకు మన సంస్కృతి అప్పుడు గుర్తు రాలేదా అని అడుగుతున్నారు. నిత్యం ఏదో అంశాన్ని తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ దిగజారుడు రాజకీయంలో భాగమే ఈ నిజ నిర్ధారణ కమిటీ డ్రామా అని వైఎస్సార్ సీపీ నేతలు దుయ్యబడుతున్నారు.
Also Read : లోకేష్ టీం మీద మహిళల ఆరోపణలు