iDreamPost
iDreamPost
చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టుంది తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు 19 స్థానాలకు గాను కేవలం నాలుగు స్థానాలకే పరిమితం చేసినా ఆ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పాత పద్ధతిలోనే కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రాజమహేంద్రవరంలో ఎప్పటి నుంచో ఆదిరెడ్డి అప్పారావుతో ఉన్న వర్గ పోరు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అలక సీను రూపంలో భగ్గుమంది. తాజాగా పిల్లి అనంతలక్ష్మిని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడానికి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పావులు కదుపుతున్నారు.
ఎప్పటి నుంచో కాకినాడ రూరల్ నియోజకవర్గంపై కన్నేసిన ఆయన పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను రాజకీయంగా టార్గెట్ చేశారు. పార్టీ కార్యక్రమాలను, కార్యకర్తలను పట్టించుకోని వారికి పెత్తనం తగదని ఏడాది క్రితమే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయించారు. రాజప్ప చేసిన రాజకీయాన్ని తిప్పకొట్టే వ్యూహంతో సత్తిబాబు అప్పట్లో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో చంద్రబాబు ఆయన్ను బుజ్జగించి యథాతథ పరిస్థితిని కొనసాగించారు. నాలుగు రోజుల క్రితం జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, భర్త చలపతి నేతృత్వంలో కొందరిని చంద్రబాబు దగ్గరకు పంపి పిల్లి దంపతులకు పొగబెట్టే కార్యక్రమానికి రాజప్ప మళ్లీ శ్రీకారం చుట్టారు. దీనిపై సత్తిబాబు వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
పార్టీని గాలికొదిలేయడం వల్లే..
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని చంద్రబాబు గాలికొదిలేయడం వల్లే వర్గపోరులు ముమ్మరమవుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తలకు నమ్మకం కలిగించే నాయకత్వం స్థానికంగా కొరవడింది. గోరంట్ల చెప్పినట్టు పార్టీ ఏదైనా ఆందోళనకు పిలుపిస్తే నాయకులు వెళ్లి నిరసన ఫొటోలు దిగి మమ అనిపిస్తున్నారు. ఆ ఫొటోలను పార్టీ హెడ్డాఫీసుకు, మీడియాకు పంపి హమ్మయ్యా అనుకుంటున్నారు. మొత్తం జిల్లాలో పార్టీ పటిష్టానికి ఒక దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేసే దిక్కులేదు. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టు సీనియర్లు సైతం వారి నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారని తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు.
లోకేష్‌ను పట్టించుకోని నాయకులు..
విలీన మండలాల్లో పర్యటనకు ఇటీవల జిల్లాకు వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిసేందుకు సైతం చాలామంది సీనియర్ నేతలు వెళ్లలేదు. ఆయన కూడా స్క్రిప్ట్ ప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లిపోయారే కాని వెళ్లిన కొద్దిమందినీ పట్టించుకోలేదు. మరీ విడ్డూరంగా నెల్లిపాక జాతీయ రహదారి సెంటర్‌లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేయమని అడిగినా లోకేష్ కారు దిగకుండా వెళ్లిపోవడం కార్యకర్తలను నిరాశ పరిచింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మేనేజ్ చేద్దామని అధి నాయకత్వం, పార్టీని నాయకుడు అధికారంలోకి తెస్తే ఫలాలు అనుభవిద్దామని స్థానిక నేతలు భావించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలుగుదేశం అభిమానులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు నేతలు ఇటు కార్యకర్తలు తూర్పునకు తిరిగి దండం పెట్టడం తప్ప చేసేదేమీ ఉండదని తెలుగుదేశం అభిమానుల ఆవేదన.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా చేయగలరా?