iDreamPost
android-app
ios-app

Tdp,peethala sujatha – అప్పుడెందుకు మాట్లాడలేదు సుజాత గారూ..?

  • Published Nov 18, 2021 | 2:10 PM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Tdp,peethala sujatha – అప్పుడెందుకు మాట్లాడలేదు సుజాత గారూ..?

అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించడం విస్తుగొలుపుతోంది. వైఎస్సార్‌ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు సాటి మహిళల కష్టాలు కనపడటం లేదా అన్నారు. ఆమె గురువారం జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. అసలు అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి మాట్లాడడమే తప్పన్నట్టు ఆమె వ్యాఖ్యలు చేశారు. . మహిళా సాధికారత గురించి మాట్లాడే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై కూడా మాట్లాడాలని సుజాత సూచించారు.

రెండున్నరేళ్లలో జరిగినవే గుర్తుకొస్తున్నాయా?

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెండున్నరేళ్లలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై మాట్లాడాలంటున్న సుజాత తమ పార్టీ అధికారంలో ఉండగా జరిగిన వాటిపై ఎప్పుడన్నా మాట్లాడారా? అన్న సంశయం సాధారణంగా ఎవరికైనా కలుగుతుంది. తెలుగుదేశం హయాంలో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో మహిళలపై అత్యాచారం జరిగినప్పడు, ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చినప్పుడు, ఎమ్మెల్యే రోజాను అక్రమంగా నిర్బంధించి కార్లలో రాజధాని చుట్టూ గంటల తరబడి తిప్పి భయానక వాతావరణం సృష్టించినప్పడు మహిళల కష్టాలు కనిపించలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మీరు ఈ అఘాయిత్యాలపై ఏ వేదిక మీదైనా ప్రశ్నించారా? ఇటువంటివి అరికట్టడానికి మంత్రిగా మీ స్థాయిలో చేసిన కృషి ఏమిటి? అంగన్‌వాడీలు వేతనాలు పెంచాలని ఆందోళన చేసినప్పుడు పోలీసుల సాయంతో క్రూరంగా అణచివేసినప్పుడు అది మహిళలపై ప్రభుత్వం చేసిన అఘాయిత్యంగా మీకు అనిపించలేదా? అని మహిళల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సుజాత ఏమని సమాధానం చెబుతారో!

Also Read : Hindupur, Chilamathur ZPTC – కూలుతున్న తెలుగుదేశం కోటలు.. ఈ రోజు బాలయ్య వంతు

మాట్లాడితే తప్పేమిటి?

ఆకాశంలో సగం అంటూ మహిళలను తరచుగా మభ్యపెట్టి ,వారిని కేవలం ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు చూసేవి. ఆ దశ నుంచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా మహిళా సాధికార దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని పథకాల ద్వారా మహిళలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. పథకాల లబ్ధి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు లక్ష కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం మహిళా సాధికారత గురించి పాటు పడడం కాదా? రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తుండగా అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్‌ ఇస్తుండడం దేశంలోనే ఒక రికార్డు అని అసెంబ్లీలో మాట్లాడితే తప్పేమిటి?

31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, 50 శాతం రిజర్వేషన్‌ను అన్ని దశల్లోనూ అమలు చేయడం,  దిశా యాప్‌ ద్వారా 6,880 మందిని పోలీసులు కాపాడడం, మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడం మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేయడం కాదా? ఇన్ని విధాలుగా ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుంటే ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే పొగిడినట్టా? వైఎస్సార్‌ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించడం సబబేనా? అని అధికార పార్టీ మహిళలే ప్రశ్నిస్తున్న దానికి సుజాత ఎలా స్పందిస్తారో..

రాజకీయ విమర్శలు గౌరవం తెస్తాయా?

మహిళా సాధికారత అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాడే పట్ట పగలు బీటెక్ విద్యార్థినిని హత్యచేయడమేనా? అని మంత్రిగా పనిచేసిన సుజాత ప్రశ్నించడం కేవలం రాజకీయ నేతగా మాట్లాడినట్టు ఉంది. హత్యలు, అత్యాచారాలు ఉద్రేకంలో జరుగుతాయి. ఫలనా సమయంలోనే చేయాలని, పండగలు, పర్వదినాల్లో చేయకూడదని నేరస్తులు అనుకోరు కదా? ఏదో ఒక సంఘటనను పట్టుకొని ప్రభుత్వంపై ఈ విధంగా బురద జల్లడం తగునా.. మహిళా సాధికారత కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఒక మహిళగా, మాజీ మంత్రిగా సూచనలు ఇస్తే గౌరవంగా ఉంటుంది. అంతేగాని పార్టీ లైన్‌ తీసుకొని ఇలా సగటు రాజకీయ నాయకుడిలా మాట్లాడితే  అభాసుపాలవుతారన్న విమర్శలు సాటి మహిళల నుంచి వస్తుండడం గమనార్హం.

Also Read : CM Jagan -నా స్పీచ్ చంద్రబాబు చూడాలి, చూస్తారు: జగన్