Idream media
Idream media
అబద్ధాలు చెబితే అతికినట్లు ఉండాలంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు చెబుతూ దొరికిపోతే.. అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా.. తిరిగి వారే అబాసుపాలవ్వాల్సి వస్తుంది. అయితే ఇవేమీ పట్టని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ నేతలు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా నోటికి వచ్చిన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అందులో వాస్తవమెంత..? తర్కం ఉందా..? అనేది ప్రజలు ఆలోచిస్తారనే విషయం కూడా మరచిపోయి టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు.
అవినీతి చూసి హడలెత్తి రాలేదట..
టీడీపీ నేతలు పార్టీని వీడిన సమయంలో.. తాను నాయకులను తయారు చేస్తానని చంద్రబాబు చెబుతుంటారు. ఇలా చంద్రబాబు తయారు చేస్తున్న నాయకుడైన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ రోజుకో విషయంపై మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కరోనా వ్యాక్సిన్ కొనుగోలు అంశాన్ని ఎంచుకున్నారు. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్లకు ఏ కంపెనీ స్పందించలేదు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అవినీతేనంటూ పట్టాభి నోటికి పని చెప్పారు. జగన్ ప్రభుత్వ అవినీతికి భయపడే వ్యాక్సిన్ కంపెనీలు ఈ రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పదించలేదంటూ ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందించిన కంపెనీలు.. ఇక్కడ స్పందికపోవడానికి అవినీతే కారణమంటూ చెప్పుకొచ్చారు. రంగులకు, ప్రచారానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. 1600 కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు ముందుకురావడం లేదంటూ విమర్శించారు.
వాస్తవాలు విస్మరించి ఆరోపణలు..
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ రాసి ఇచ్చే స్క్రిప్ట్ చదివే పట్టాభి.. అందులో నిజానిజాలు ఏమిటో కూడా క్రాస్ చెక్ చేయడంలేదని అర్థమవుతోంది. వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోండంటూ కేంద్రం చెప్పిన మేరకు.. అన్ని రాష్ట్రాలు టెండర్లు పిలిచాయి. కానీ వ్యాక్సిన్ విధానంపై ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో.. రాష్ట్రాలు పిలిచిన టెండర్లకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. ఈ విషయంపై తమ పరిస్థితిని వివరిస్తూ.. కేంద్రమే వ్యాక్సిన్‌లు సరఫరా చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామంటూ కేరళ, ఒడిశా ముఖ్యమంత్రులు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ కూడా అదే విధంగా లేఖలు రాశారు. ఏపీతో సహా దేశంలోని ఇతర రాష్ట్రాలు పిలిచిన టెండర్లకు స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి స్పందన రాలేదు. రోజు పత్రికలు చదివేవారికి ఈ విషయం తెలుసు. వ్యాక్సిన్ కొనుగోలుపై విమర్శలు చేస్తున్న టీడీపీకి.. మంత్రి కొడాలి నాని బంఫరాఫర్ ఇచ్చారు. ఆ 1600 కోట్ల రూపాయలు మీకే ఇస్తామని.. వ్యాక్సిన్ తెప్పించాలంటూ కోరారు. అందుకు 10 శాతం కమీషన్ కూడా ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. మరి ఆ పనేదో పట్టాభి చేస్తే.. 10 శాతం కమీషన్ రూపంలో 160 కోట్ల రూపాయలు పట్టాభికి వస్తాయి కదా..? ఇంత భారీ ఆఫర్‌ను ఎందుకు వదులుకుంటున్నారు పట్టాభి..?
Also Read : అన్నట్టు.. చంద్రబాబు వ్యాక్సిన్ వేసుకున్నారా?