iDreamPost
iDreamPost
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 36 గంటల దీక్ష తదనంతర పరిణామాలు విజయవాడ టీడీపీలో కొత్త సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కేశినేని నాని మళ్లీ పార్టీకి దగ్గర కావడం, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ చేసిన హడావుడి ఆయన వ్యతిరేకవర్గానికి మింగుడుపడటం లేదు. కేశినేని ఇక పార్టీకి దూరమైనట్లేనని భావించిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా త్రయం ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని అంతర్గతంగా మధన పడుతోంది. దీంతో విజయవాడ టీడీపీలో మళ్లీ పోరాటం మొదలైనట్లేనని ఆ పార్టీ వర్గీయులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ముసలం
గత మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ టీడీపీ రెండుగా చీలిపోయింది. ఎంపీ కేశినేని నానీ ఏకపక్షంగా తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం, తన అనుచరులకు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకోవడాన్ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా బృందం తప్పుపట్టి నిలదీసింది. ప్రచారంలోనూ, మీడియా సమావేశాల్లోనూ ఇరువర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ రచ్చ గురించి అధినేత చంద్రబాబుకు తెలిసిన పట్టించుకోలేదని కేశినేని అలకబూనారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమార్తె పోటీ చేయబోమని ప్రకటించడమే కాకుండా తన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల ఫోటోలను తీయించేశారు. ఈ పరిణామాలతో కేశినేని టీడీపీకి పూర్తిగా దూరం అయినట్లేనని ఆ పార్టీవారు భావించారు.
Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?
వీరి పరిస్థితి ఏంటో?
ఈ తరుణంలో పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబు 36 గంటల దీక్ష నిర్వహించారు. మొదటి రోజు కేశినేని అటువైపు చూడలేదు. దాంతో బాబు తరఫున టీడీ జనార్దన్, ధూళిపాళ్ల నరేంద్రలు నానీతో చర్చించి ఒప్పించడంతో ఆయన రెండో రోజు హాజరయ్యారు. అయితే ప్రసంగించడానికి తొలుత నిరాకరించినా.. చంద్రబాబు ఏకాంతంగా మంతనాలు జరిపి బుజ్జగించడంతో అలక వీడి రెచ్చిపోయి ప్రసంగించారు. అంతేకాకుండా బాబు ఢిల్లీ పర్యటనలోనూ నానీ హడావుడి ఎక్కువగా కనిపించింది.
ఊహించని ఈ పరిణామాలు నానీని వ్యతిరేకిస్తున్న బోండా, బుద్దా వర్గంలో కలవరం రేపుతున్నాయి. ఏకాంత చర్చల్లో చంద్రబాబు ఏం హామీలు ఇచ్చారోనని ఆంతరంగిక చర్చల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. అధినేత భరోసాతో నానీ మళ్లీ రెచ్చిపోతే తమ పరిస్థితి ఏమిటని మధనపడుతున్నారు. కేశినేని వర్గం మళ్లీ పార్టీలో క్రియాశీలం అయితే తమకు ఇబ్బందులు తప్పవని ఈ ముగ్గురు నేతలు అనుచరులు ఆందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పార్టీలో మళ్లీ వర్గ విభేదాలు, వివాదాలు తప్పవేమోనని సామాన్య కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?