iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అమరావతి ప్రాజెక్టును అర్థాంతరంగా ఆపడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని పార్లమెంట్ లో వైఎస్సార్ సీపీ ఎంపీ భరత్‌రామ్ చెప్పడం ద్వారా రాష్ట్రం పరువు తీశారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ఈ ఆర్థిక పరిస్థితి అని సభను తప్పుదారి పట్టించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.3 లక్షల 8 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, అమరావతికి సంబంధం ఏమిటి?
రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక గడ్డు పరిస్థితికి, చంద్రబాబు కలల రాజధాని అమరావతి నిర్మాణానికి అసలు సంబంధం ఏముంది? లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని నిర్మించేస్తే రాష్ట్రంలోని సమస్యలన్నీ పరిష్కారం అయిపోవడానికి అదేమైనా జిందా తిలిస్మాతా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టడం మంచి నిర్ణయమని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. దాన్ని నిర్మిస్తే ఎవరికి ప్రయోజనమో, ఏ వర్గం వారి ఆస్తుల విలువ తక్షణం పెరుగుతుందో రాష్ట్రంలో అందరికీ అర్థమైంది కాబట్టే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను మిగతా జిల్లాల వారు పట్టించుకోవడం లేదు. అదిగో అమరావతి ఇదిగో ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించి ఐదేళ్లూ కాలక్షేపం చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ వంకతో ప్రజాధనాన్ని దుబారా చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఏ దేశం వెళితే ఆ దేశం పేరు చెప్పి అచ్చం అలాంటి రాజధాని కట్టేస్తానని నమ్మబలికేవారు. ఇందుకోసం ప్రత్యేక విమానాల్లో ఆయన, మంత్రులు విలాస యాత్రలు చేసేవారు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా, వాస్తవానికి దూరంగా బాబు చేసిన హంగామా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. రాజధాని నిర్మాణం జరగలేదు సరికదా సేకరించిన భూములకు ఏటా పెద్ద మొత్తంలో కౌలు చెల్లించవలసిన భారం ప్రభుత్వంపై పడింది.
Also Read : Amravati, Kanakamedala, Rajya Sabha – రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ
పరువు పోయేదేముంది?
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని పార్లమెంట్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీ భరత్‌రామ్ చెప్పడం వల్ల రాష్ట్రం పరువు పోతుందని ఎంపీ కనకమేడల వ్యాఖ్యానించడం మరీ వింతగా ఉంది. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా, రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమస్యలను, వాస్తవ పరిసిత్థిని వివరిస్తే తప్పేంటి? బాబు చేసిన నిర్వాకానికి తోడు.. కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన మాట వాస్తవం కాదా? పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలకు అనేక కొర్రీలు వేస్తూ, కేవలం నిర్మాణానికే నిధులిస్తాం. ఆర్ అండ్ ఆర్ మాకు సంబంధం లేదని కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకోవడం వల్ల ఆ భారం రాష్ట్రం భరించాల్సి వచ్చింది. ఇలా అనేక కారణాలకు తోడు కోవిడ్ దాడితో ఆదాయం పడిపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. అనివార్యంగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టంగా ఉందని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే పరువు ఎందుకు పోతుంది. అప్పులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసి చంద్రబాబుపైకి నెట్టడమేంటని ప్రశ్నిస్తున్న కనకమేడల ప్రస్తుత దుస్థితి దాపురించడంలో అప్పటి సీఎంగా చంద్రబాబు పాత్ర లేదంటారా?
శ్వేతపత్రం ఎందుకు?
రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ కనకమేడల తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారో చెబితే బావుండేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జనానికి కళ్లకు కట్టినట్టు వివరిస్తోంది. అదే విషయాలను లోక్‌సభలో ఎంపీ భరత్‌రామ్ ప్రస్తావించారు. ఈ దుస్థితి నుంచి గట్టెక్కే మార్గాలు అన్వేషించాలి కాని అందరికీ తెలిసిన నిజాలపై శ్వేతపత్రాలెందుకో కనకమేడల చెప్పాలి.
Also Read : Kanakamedala Ravindra – రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి.. టీడీపీ ఎంపీ లెక్కలివిగో