iDreamPost
android-app
ios-app

బిటెక్‌ రవి మొదలెట్టారు..!

బిటెక్‌ రవి మొదలెట్టారు..!

మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కడప జిల్లా టీడీపీ నేత బిటెక్‌ రవి చంద్రబాబు తనకిచ్చిన బాధ్యతలను విజయవంతంగా మొదలుపెట్టారు. అమరావతికి మద్ధతుగా రాయలసీమ వాసి అయిన తానే రాజీనామా చేసినప్పుడు రాజధాని ప్రాంత కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరంటూ ఆయన ఈ రోజు ప్రశ్నించారు. మూడు రాజధానులకు పులివెందులలోనే వ్యతిరేకత ఉందంటూ బిటెక్‌ రవి చెప్పుకొస్తున్నారు. రేపు సోమవారం తన అనుచరులతో కలసి అమరావతిలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు వెళుతున్నట్లు ఆయన ప్రకటించారు.

బిటెక్‌ రవి రాజీనామా చేసిన వెంటనే ఇదో పొలిటికల్‌ స్టంట్‌ అని అందరూ భావించారు. అది నిజమని ఆయన తన రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు కాకుండా పార్టీ అధ్యక్షుడుకు పంపినప్పుడే తెలిసింది. తాజాగా నేను రాజీనామా చేశాను.. అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్మేలు ఎందుకు చేయరంటూ ఆయన మాట్లాడినప్పుడే టీడీపీ లక్ష్యం ఏమిటో అర్థం అవుతోంది. అమరావతికి రాయలసీమ ప్రాంతం నుంచి మద్ధతు ఉందని చెప్పుకునేందుకు బిటెక్‌ రవితో రాజీనామా డ్రామాకు చంద్రబాబు తెరతీశారనే ప్రచారం సాగుతోంది. నష్టం జరిగిందనుకుంటే ముందు ఆ ప్రాంత వాసులు స్పందిస్తారు. అది నిజమని నమ్మితే ఇతర ప్రాంతాలవాసులు మద్ధతు ఇస్తారు. అయితే ఇక్కడ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. అమరావతి కోసం స్థానికంగా ఉండే టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ రాజీనామా చేయలేదు.

గత ఎన్నికల్లో రాజధాని ప్రాంత నియోజకవర్గమైన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్‌ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కొనసాగుతున్నారు. మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదనే ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు అమరావతి పక్కనే ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, విజయవాడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్‌మోహన్‌ల చేత రాజీనామా చేయించొచ్చు. కానీ టీడీపీ అధినేత ఆ పని చేయడం లేదు. చంద్రబాబు డైరెక్షన్‌లో రాజీనామా డ్రామా రక్తికట్టించేందుకు యత్నిస్తున్న బిటెక్‌ రవి కూడా.. తన పార్టీ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేయడంలేదు..? అని ప్రశ్నించకుండా.. వైసీపీ ప్రజా ప్రతినిధుల వైపు ఏలెత్తి చూపిస్తున్నారు. ఇక్కడే వారి రాజకీయ ఎత్తుగడ స్పష్టంగా తెలుస్తోంది.

అమరావతి కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపులు ఇస్తున్న చంద్రబాబు ముందు తన కుమారుడు చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి చిత్తశుద్ధి నిరూపించుకుంటే ఆయన మాటల్లో ఎంతో కొంత నిజాయతీ ఉండేది. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతం నుంచి పోటీ చేసిన తన కుమారుడును మండలి స్థానానికి రాజీనామా చేయించకుండా రాయలసీమలోని పులివెందుల ప్రాంత వాసి అయిన బిటెక్‌ రవిచేత రాజీనామా చేయించడంతోనే ఆయన అమరావతి పేరుతో చేస్తున్న రాజకీయం ఏమిటో సీమ వాసులు తెలుసుకున్నారు. ఈ విషయం రాజధాని ప్రాంతలో ఉద్యమం చేస్తున్న వారికి తెలియడమే ఇక మిగిలింది.