iDreamPost
iDreamPost
వైఎస్సార్ సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తరచు ఆరోపణలు చేసే తెలుగుదేశం పార్టీ తన గోబెల్స్ ప్రచారానికి రాజ్యసభను కూడా వేదికగా చేసుకుంది. ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగిస్తూ వైఎస్సార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఆర్థిక అరాచకం నెలకొందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయిదాటి పోతుందన్నారు.సభాపతి వారిస్తున్నా వినకుండా పదే పదే అసత్యాలను వల్లె వేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారని తన పాత పాటను వినిపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని మరో అబద్ధాన్ని అలవోకగా ప్రస్తావించారు.
కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ ఒక వాస్తవాన్ని కావాలనే విస్మరిస్తోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పు చేస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వానికి రుణ పరిమితిని కేంద్రం కుదించింది. టీడీపీ సర్కారు తప్పుచేస్తే తమకు శిక్షవేయడం తగదని, రుణ పరిమితిని పెంచాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కోరింది కూడా. టీడీపీ ప్రభుత్వం రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి లెక్కాపత్రం లేకుండా ఖర్చుచేయడం వల్లనే రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిపోయింది.
టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సరికీ అంటే 2019 నాటికి రూ.49,500 కోట్ల పెండింగు బిల్లులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వారసత్వంగా వదిలివెళ్లింది. ఆ బిల్లులు చెల్లించడమే కాక, టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీగా జమ చేస్తోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. అదికూడా పరిమితికి లోబడే. వాస్తవాలు ఇలా ఉండగా దీనికి పూర్తి భిన్నంగా టీడీపీ కొంతకాలంగా రాద్దాంతం చేస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రాజకీయ డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. చాలా రాష్ట్రాల కన్నా మెరుగైన ఆర్థిక నిర్వహణతో ఉన్న ఏపీలో కేంద్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
క్యాసినో పైనా అదే ప్రచారం..
గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించినట్టు రుజువు చేయాలని మంత్రి కొడాలి నాని సవాల్ చేస్తే ఇప్పటికీ స్పందించని టీడీపీ నేతలు తమ దుష్ప్రచారం కొనసాగిస్తుండడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెడుతున్నారని కనకమేడల చేసిన విమర్శ మరీ బండ అబద్ధం. ఎందుకంటే అటువంటి ఆరోపణలు పవన్ కల్యాణ్ కాని, ఏ ఒక్క చిత్ర నిర్మాత కాని చేయలేదు. అదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటారు.? దీన్ని బట్టే టీడీపీది తప్పుడు ప్రచారం అని అర్థం అవుతోంది. అందుకే కనకమేడల ప్రసంగాన్ని వైఎస్సార్ సీపి ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలోనే తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ధీటుగా బదులిచ్చారు.