Idream media
Idream media
రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటాడు. నిత్యం ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. తాజా పరిణామాలను గమనిస్తూ.. భవిష్యత్‌ను అంచనా వేసి తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయనుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజం తర్వాత ఇక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పని అయిపోయిందనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లోనే నెలకొంది. అందుకే ఎన్నికలు ముగిసిన తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతలు కూడా నాయకత్వం మారితే భవిష్యత్ ఉంటుందనే ఆశతో పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే మూడు రాజధానులు ప్రతిపాదన తర్వాత చంద్రబాబు వ్యవహారశైలితో పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయింది.
మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. జలవనరులు పుష్కలంగా ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు రాజధాని ఎక్కడ ఉన్నా తమకు కొత్తగా వచ్చేదేమీ లేదనే భావనతో ఉన్నారు. అన్ని విధాలుగా వెనుకబడి, ఇప్పటికీ పొట్టచేతపట్టుకుని వలసలు పోతున్న ఉత్తరాంధ్ర, సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు మాత్రమే మూడు రాజధానుల వల్ల తమకు ప్రయోజనం ఉంటుదని భావిస్తున్నారు. తమ ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని భావిస్తున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి జై కొడుతున్నారు. ప్రజల నాడిని అంచనా వేసిన టీడీపీ నేతలు అందుకు తగ్గట్లుగా నడుచుకుంటున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండంటూ చంద్రబాబు పిలుపులు ఇస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు.
మూడు రాజధానులను ప్రకటించిన సమయంలో బాబు వ్యతిరేకించినా.. ఆ తర్వాత అంగీకరిస్తారే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే తాజాగా పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత నుంచి ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్‌పై లోతైన సమాలోచనలు జరుపుతున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తే రాజకీయ భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి పలువురు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. అందుకే బాబు తరచూ జూమ్‌లో నిర్వహించే సమీక్షలకు కూడా డుమ్మా కొడుతున్నారు. రాజీనామాలు చేద్దాం అంటూ చెబుతున్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం వారంతా మోహం చాటేయడమేనని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతు చెబుతున్నారు.
మూడు రాజధానుల అంశంతోపాటు ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు నాయకత్వంలో తమకు భవిష్యత్ ఉండదనే భావనలో టీడీపీ నేతలున్నారు. నాయకత్వం మారితే అవకాశాలు ఉంటాయనే భావనలో ఉన్నారు. కానీ చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నంత కాలం టీడీపీ పగ్గాలు మరొకరి చేతిలోకి వెళ్లవు. ఇప్పటికే తన కుమారుడుకు పట్టాభిషేకం చేయాలని అతన్ని సానబడుతున్నారు. కానీ లోకేష్.. బాబు అంచనాలకు తగినట్లుగా సిద్ధం కావడంలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడులా లోకేష్ భవిష్యత్ కోసం బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ పని తీరు, శక్తి సామర్థ్యాలు ఏమిటో టీడీపీ శ్రేణులకు ఇప్పటికే అర్థం అయ్యాయి. అందుకే తమ భవిష్యత్‌కు మంచి మార్గం వేసుకునేందుకు టీడీపీ నేతలు సమాలోచనలు సాగిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రయత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ టీడీపీ నేతలకు ఓ అవకాశంలా కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 2024లోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రాహుల్ గాంధీ మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదు. అంటే మరోమారు మోదీకి అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ జనసేతో కలిసి వెళుతోంది. వచ్చే ఎన్నికల నాటికి తన ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అధ్యక్షుడును మార్చింది. ఈ పరిణామాలన్నింటినీ సునిశితంగా గమనిస్తున్న టీడీపీలోని పలువురు తాజా, మాజీ నేతలు కమలం వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీ నేతలను చేర్చుకునేందుకు సుముఖంగా ఉంది. సరైన సమయంలో టీడీపీ నేతలు కమలం గూటికి చేరేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు. ఆ టైం రావడమే మిగిలి ఉంది.