iDreamPost
android-app
ios-app

అబద్దాల పునాదులపై గాలి మేడలు!

  • Published Aug 22, 2021 | 10:46 AM Updated Updated Aug 22, 2021 | 10:46 AM
అబద్దాల పునాదులపై గాలి మేడలు!

ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే నిజమేనేమో అనిపిస్తుంది. ప్రజలతో అదే మైండ్ గేమ్ ఆడి.. వారిని భ్రమల్లోకి నెట్టేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.. దాన్ని భుజానికెత్తుకున్న పచ్చ మీడియా..టీడీపీ సోషల్ మీడియా గత రెండేళ్ల నుంచీ అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అనే విషాన్ని ప్రజల మైండ్ లోకి ఇంజెక్టు చేసేందుకు తెగ ఆరాట పడిపోతున్నాయి. గత ఎన్నికల్లో అపూర్వ మెజారిటీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ తరహా విషప్రచారానికి బరితెగించాయి. ప్రజా విశ్వాసం కోల్పోయి అట్టడుగు స్థాయికి దిగజారిపోయిన టీడీపీ ప్రతిపక్ష పాత్రను ముళ్ల కంపలా భావిస్తోంది. పార్టీ క్యాడర్ ను కాపాడుకోలేని ఆ పార్టీ.. వచ్చేది మా ప్రభుత్వమే అని డబ్బా కొట్టుకుంటుంటే.. అబద్దాలను, ఊహాజనిత అంశాలను, వాస్తవికతకు దూరంగా ఉన్న విషయాలను నిరంతరం వండి వారుస్తూ పచ్చ మీడియా టీడీపీ నేతలకు గ్రాసం అందిస్తోంది. వారు చెప్పే సోది కబుర్లను టీడీపీ సోషల్ మీడియా అంది పుచ్చుకుని చిలవలు పలవలుగా విష ప్రచారం చేస్తోంది. ఇటీవలి కాలంలో ఈ పైత్యం మరింత ముదిరి పరాకాష్టకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఏవో రెండు మూడు సంస్థలు వెలువరించిన అధ్యయనాలను పట్టుకొని అప్పుడే టీడీపీ అధికారంలోకి వచ్చేసినంత కలరింగ్ ఇస్తున్నారు.

వాస్తవికతకు దూరంగా..

కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుంది టీడీపీ, దాని అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా పరిస్థితి. ఇటీవల జాతీయ స్థాయిలో ఒక మీడియా సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతలు, ముఖ్యమంత్రులు ఎవరన్న అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో ఏపీ సీఎం జగన్ తక్కువ రేటింగ్ వచ్చిందని వెల్లడించిన వివరాలతో పాటు ఆత్మసాక్షి, లోకల్ యాప్ నిర్వహించిన సర్వేల్లో ఇప్పటిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి ఎక్కువ సీట్లు లభిస్తాయని పేర్కొనడాన్ని పచ్చ మీడియా బాగా హైలైట్ చేసి జగన్ పని అయిపోయిందని తెగ ప్రచారం చేస్తోంది. అలాగే ఒక సర్వే సంస్థ, లోకల్ యాప్ అనే మరో సంస్థ వైఎస్సార్సీపీ ఓడిపోయే సూచనలు ఉన్నాయని పేర్కొన్నాయి. వీటిని పట్టుకొని వచ్చే ఎన్నికలతో ఆ పార్టీ ఓడిపోతుందని, దానికి ప్రాభావం మసక బారిందని ఒకానొక పచ్చ మీడియా వార్తలు వండి వార్చితే. దాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ నేతలు, దాని అనుబంధ సోషల్ మీడియా మరింత రెచ్చిపోతోంది. సంబంధిత సర్వేల్లో శాస్త్రీయత ఎంత.. సదరు సర్వేను ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహించారు, ఎంతమంది నుంచి అభిప్రాయాలు సేకరించారన్న వివరాలు వెల్లడించకుండా అధికార పార్టీ ఓడిపోతుందని నిర్ధారించడం ఏ మేరకు సబబన్నది ఆలోచించకుండా.. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సదరు మీడియా వార్తలు వండివార్చడం చూస్తే వారి శరీరమంతా పచ్చదనం కమ్మేసిందని ఎవరికైనా అర్థం అవుతుంది.

ప్రజలు తీర్పు ఇచ్చి నాలుగునెలలు కాకముందే..

పలు సంస్థలు ప్రకటించే అంచనాలు యధాతధంగా వాస్తవ రూపం దాలుస్తాయా లేదా అన్నది పక్కన పెడితే.. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర ప్రజలు పలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీకే మళ్లీ ప్రజలు పట్టం కట్టారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీని తిరస్కరించి వైస్సార్సీపీకే అండగా నిలిచారు. అధికార పార్టీ పట్ల తమ వైఖరి ఏమాత్రం మారలేదని ఆ తీర్పుల ద్వారా ప్రకటించారు. ఇంతకన్నా స్పష్టంగా ఏ సర్వే సంస్థ అయినా అంచనా వేయగలదా? ప్రజాతీర్పు వెలువడిన తర్వాత ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయే స్థాయిలో జరిగిన పరిణామాలు కూడా లేవు. మరోవైపు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రెండేళ్లలో టీడీపీ కోలుకున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. వలసలతో పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. నేతల ప్రెస్ మీట్లు, ప్రకటనలే తప్ప ప్రజల గురించి ఆ పార్టీ పట్టించుకున్నది కూడా లేదు. అలాంటప్పుడు ఏం చూసి ప్రజలు టీడీపీని గెలిపిస్తారో.. సదరు విష ప్రచారానికి పాల్పడుతున్నవారే సెలవివ్వాలి. అవాస్తవాలతో మైండ్ హామీ ఆడినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారనుకోవడం భ్రమేనని, తమది ఆత్మవంచనే అని గుర్తిస్తే మంచిది.