iDreamPost
iDreamPost
టీడీపీ నేతల పరిస్థితి అమాంతంగా మారిపోయింది. ఒకనాడు విపక్షంలో ఉన్నప్పటికీ విధానపరంగా ఆపార్టీ స్పష్టతతో కనిపించేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఏకంగా పార్టీ అధినేతనే పదే పదే మాట మారుస్తున్న సమయంలో ఇతర నేతలకు హద్దూ, పద్దూ లేకుండా పోయింది. అందుకు తగ్గట్టుగానే మాజీ మంత్రి దేవినేని ఉమా తీరు కనిపిస్తోది. తాజాగా ఆయన అసెంబ్లీని రద్దు చేయాలంటూ ఓ హస్యాస్పద ప్రకటన చేశారు. పైగా స్థానిక ఎన్నికలు జరిగితే అసెంబ్లీ రద్దు చేస్తామని జగన్ అన్నట్టుగా సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి స్థానిక ఎన్నికలకు, చట్టసభలకు పొంతన ఏంటి, పైగా ఈ ఎన్నికల్లో అత్యధికంగా అధికార పార్టీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే ఏకగ్రీవాల్లో దూకుడుగా ఉంది. అయినా గానీ కలలు కంటున్న టీడీపీనేతలు కట్టుకథలతో సాగడం విశేషంగానే చెప్పాలి.
ఒకనాడు చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ వైఎస్సార్ హయంలో దానిని ఆచరించి, చూపించి అందరి మన్ననలు పొందారు. చివరకు చంద్రబాబు కూడా ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పాల్సిన స్థితికి తీసుకొచ్చారు. సరిగ్గా ఇప్పుడు జగన్ హయంలో కూడా అలాంటి అనుభవమే ఎదురవుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగిన వారిపై ఆయన మండిపడ్డారు. ఇవ్వడానికి ప్రభుత్వ స్థలాలు లేవని తేల్చేశారు. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకు కూడా కట్టబెట్టేందుకు సిద్ధపడిన బాబు పేదలకు మాత్రం సెంటు స్థలం ఇవ్వడానికి ససేమీరా అన్నారు. కావాలంటే జీ ప్లస్ 4 భవనాలు నిర్మించి ఇస్తామని తేల్చేశారు. అలానే కొన్ని చోట్ల పునాదులు వేసి పూర్తి చేయకుండా పాలన ముగించారు.
తీరా ఇప్పుడు జగన్ పట్టుదలతో చేసిన ప్రయత్నం మూలంగా పేదలకు కనీసం తలదాచుకోవడానికి సొంత స్థలం కేటాయించారు. ఊరూ వాడా సొంతిల్లు లేని పేదలు ఉండడకూడదనే సంకల్పంతో ఆయన సాగుతున్నారు. దాంతో చివరికిప్పుడు నాడు ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయని ప్రశ్నించిన చంద్రబాబు, తాము కూడా అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెబుతున్నారు. నాడు వైఎస్సార్ మూలంగా మాట మార్చి ఉచిత విద్యుత్ అమలుకి పూనుకోవాల్సి వచ్చిన చంద్రబాబుకి ఇప్పడు జగన్ మూలంగా పేదలకు స్థలాలు ఇవ్వడానికి కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇలాంటి వైఖరితో పదే పదే మాట మారుస్తూ యూటర్న్ బాబుగా ఆయన పేరుని సార్థకం చేసుకుంటున్న సమయంలో దిగువ స్థాయి నేతలను అంతకుమించి ఆశించడం కూడా కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ఇప్పుడు టీడీపీ నేతలంతా కనీసం కూడా ప్రజా పునాది ఉన్న వారు కూడా కాదు. ప్రస్తుతం టీడీపీ స్వరకర్తలుగా ఉన్న పట్టాభి కి పట్టుమని ఒక డివిజన్ లో కూడా గెలిచే అవకాశం లేదు. వర్ల రామయ్య ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములు సొంతం చేసుకున్నారు. సోమిరెడ్డి గురించి చెప్పనవసరం లేదు. ఇలా ఎన్నడూ ప్రజల మద్ధతు లేని నేతలే ఇప్పుడు చంద్రబాబు కి అధికార ప్రతినిధులు కావడం ఆపార్టీ దుస్థితికి దర్పణం పడుతోంది. టీడీపీ ఇక తేరుకునే అవకాశం లేదని తేటతెల్లం చేస్తోంది. చివరకు ఉమా లాంటి వారు డిమాండ్లు చేస్తూ ఉన్న పరువు కూడా కృష్ణా నదిలో కలిపేసే పరిస్థితి వస్తోంది