iDreamPost
android-app
ios-app

టీడీపీ కి గుడ్ బై చెబుతున్న సీనియర్లు, స్థానిక ఎన్నికల్లోనూ ఆగని వలసలు

  • Published Jan 31, 2021 | 9:24 AM Updated Updated Jan 31, 2021 | 9:24 AM
టీడీపీ కి గుడ్ బై చెబుతున్న సీనియర్లు, స్థానిక ఎన్నికల్లోనూ ఆగని వలసలు

తెలుగుదేశం పార్టీ కష్టాలు రెట్టింపవుతున్నాయి. రానురాను ప్రాభవం కోల్పోతున్న పార్టీకి సీనియర్లు దూరమవుతున్నారు. చివరకు స్థానిక ఎన్నికల సందర్భంగానూ టీడీపీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతుండడం ఆసక్తిగా మారుతోంది. చంద్రబాబు నాయకత్వంలో ఇక మనుగడ కష్టమేననే నిర్ణయానికి వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో కీలక సామాజికవర్గానికి చెందిన ఆమె గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అంతకుముందు రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

విశాఖ జిల్లాలో నర్సీపట్నంలో కూడా టీడీపీ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. అందులో విశాఖ డెయిరీ డైరెక్టర్లు గా, అయ్యన్నపాత్రుడికి ప్రదాన అనుచరులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ తీరు నచ్చని కొందరు నేతలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా కీలక నేతలు టీడీపీ బైబై చెప్పేశారు. ఇలా అనేక జిల్లాల్లో టీడీపీ ని వీడేందుకు పలువురు సిద్ధమవుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ పై సాగిననేతలు కూడా ప్రస్తుతం ఆపార్టీని వీడుతున్న వారిలో ఉండడం విశేషం. ముఖ్యంగా కీలకమైన సామాజికవర్గాలకు చెందిన వారు సైకిల్ కి సెలవు చెబుతున్న పరిస్థితుల్లో ఆపార్టీ భవితవ్యం సందిగ్ధంగా మారుతోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల సందర్బంగా పలు చోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు పోటీకి దూరంగా ఉంటున్నారు. చివరకు ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాలు, మండల అధ్యక్షులుగా ఉన్న నేతల సొంతూళ్లలో కూడా పోటీకి మొఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ వలసల పర్వం ఆగుతున్నట్టు కనిపించడం లేదు.

మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఇప్పటికే నలుగురు ఆపార్టీని కి దూరమయ్యారు. మరికొందరు కార్యక్రమాలకు, చివరకు స్థానిక ఎన్నికలకు కూడా ముందుకు రాకపోవడంతో టీడీపీకి గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. క్యాడర్ కూడా చేజారిపోతున్న తరుణంలో ఇక టీడీపీని కాపాడడం అంత సులువు కాదని అర్థమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి రాజ్యాంగ వ్యవస్థల్లో తనకున్న నోడ్స్ ద్వారా రచ్చ చేస్తున్నప్పటికీ తాజా పంచాయితీ ఎన్నికల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు నిమ్మగడ్డకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆయన అంత హంగామా చేసి ఉండకపోతే తమకు ఇంత త్వరగా పదవీయోగ్యం లేకపోయేదని చెబుతున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది.