Idream media
Idream media
ఒకప్పుడు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన టీడీపీ ప్రస్తుతం అక్కడ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడి వ్యవహార శైలి ఇందుకు ఒక కారణమైతే.. ఇటీవల తరచూ బీజేపీలోకి వలసలు పెరుగుతాయని నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే చెబుతుండడం, మరోవైపు చాలా మంది టీడీపీ ప్రముఖ నేతలు వైసీపీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం ఇంకో కారణం. తాజా రాజకీయ సమీకరణాలు ఎటువైపు మారినా ప్రభావం పడేది తెలుగుదేశం పార్టీపైనే. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లలో ఆ ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికంగా ఆయా నియోజకవర్గాలలో వలసలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
వలసలు ప్రోత్సహించే విధంగా..
రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో జరిగిన మార్పులు అనంతరం మళ్లీ వలసల్ని ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొంత మంది టీడీపీ ప్రముఖులు బీజేపీలో చేరారు. వారి తర్వాత వలసలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం మళ్లీ బీజేపీ నుంచి ఆ ప్రకటనతో టీడీపీలో ఉన్నా ఏం లాభం లేదనుకున్న కొందరు ప్రముఖులు ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు వైసీపీలో చేరే ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో బీజేపీ వైపు చూస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీ వెనుక చంద్రబాబు ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నా ఒక్కటే అనుకున్నంత నేతలంతా ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే టీడీపీ ఆదుకుంటుందన్న ధైర్యం చాలా మందిలో నశించింది. అలాంటి వారిని తమవైపు తిప్పుకునే పనిలో సోము వీర్రాజు ఉన్నారు. వైసీపీ మాత్రం వలసలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ పార్టీ దృష్టి పెడితే రాజకీయ చిత్రం మరోలా ఉంటుంది. ఏదేమైనా వలసలంటూ మొదలైతే ఏపీలో రెండు జిల్లాలు మినహా తెలుగుదేశానికి ఇక కాలం చెల్లినట్లేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.