iDreamPost
iDreamPost
… ఆగండాగండి.. టైటిల్ చూసి ఇదేదో ‘ఏ’ సర్టిఫికెట్ వ్యవహారం అనుకునేరు. కాదండీ బాబూ పక్కాగా పబ్లిక్ విషయమే. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పంచనో, కేంద్రంలోని బీజేపీ పక్కకో చేరిపోయేందుకు తట్టాబుట్టా సర్దేసుకుని సిద్ధంగా ఉన్నారన్నది పబ్లిక్‌లో నడుస్తున్న టాక్.
అధికార మార్పిడి జరిగాక లేదా ఎన్నికల ముందు సాధారణంగా ఇటువంటి వలసలు ఉండడం కామనే కదా అని సర్దిచెప్పుకుందామనుకున్నాగానీ ప్రస్తుతం ఈ వలసల సంఖ్య కాస్తంత ఎక్కువగానే ఉండడంతో పలు సందేహాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వెళుతున్న నాయకులు కూడా తమతమ ప్రాంతాల్లో చక్రం తిప్పే సామర్ధ్యం ఉన్నవారే. ఎమ్మెల్యేగానో అంతకంటే ఎక్కువ స్థాయో ఉంటున్నవారే. ఇప్పటికప్పుడు ఎన్నికలు ఎటూ లేవు. అయినప్పటికీ వీరంతా ఎందుకు పక్కచూపులు చూస్తున్నారన్నదానికి పలువురు విశ్లేషకులు చెబుతున్న వివరణ అతికినట్టు సరిపోతోంది.
అదేంటంటే.. ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాను ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఆ పార్టీ తన పాత్రను సక్రమంగా పోషించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అదెలా ఉంటే… ఆరేడు నెలలుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అత్యంత కీలకమైన ఏపీలో అడుగు పెట్టలేదు. పెట్టినా ఏదో ముట్టుకుంటే అంటుకుంటుందిలే అన్న రీతిలో మమ అనిపించేస్తున్నారు. ఎంత సేపూ జూమ్ ద్వారానే ఏపీలో రాజకీయం నడిపించేయడానికి అలవాటు పడిపోయారు. అది కూడా పాలక పక్షం మీద కేవలం బురదజల్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. తాను చేస్తున్న పనినే క్షేత్రస్థాయి వరకు నాయకులకు పురమాయిస్తున్నారు.
అయితే కార్యక్షేత్రంలోకి వెళ్ళకుండా ప్రెస్‌మీట్‌లు, వీడియో సందేహాలు, జూమ్ మీటింగ్‌ల ద్వారా జనాన్ని ఆకట్టుకోవడం ఆ పార్టీ నాయకుల వల్ల కావడం లేదు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని సొంత పార్టీ నాయకుల మధ్య తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నట్టుగా భోగట్టా.
ఈ నేపథ్యంలో గత పాతికేళ్ళుగా పార్టీకి అన్నీ తానై నడిపించిన చంద్రబాబు కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న సందేహాలు అలముకుంటున్నాయి. సంక్షేమ పాలనతో అధికార పార్టీ ఒకవైపు దూసుకుపోతుండగా, రాష్ట్రంలో తన స్థానం పదిలం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెరవెనుక రాజకీయం ప్రజలను ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నదానిపై ఆ పార్టీ నేతలకు అనేక శంకలు పట్టిపీడిస్తున్నారు. చంద్రబాబు రిటైర్ అయితే పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారు? అన్న భయాందోళనలు ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే లేకపోలేదు. దీంతో దూరదృష్టితో ఆలోచిస్తున్న ఆ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది.
చంద్రబాబు బైటకు రాకపోవడానికి కరోనాను సాకుగా చూపుతున్నప్పటికీ పార్టీ శ్రేణులు సంతృప్తి పడడం లేనట్లుగా తెలుస్తోంది. ఎందుకుంటే కరోనా పూర్తిగా తగ్గితేనేగానీ జనంలోకి వెళ్ళము అంటే, అదెప్పటికి తగ్గుతుంది? ఇంకెప్పుడు మేము జనంలో కెళ్ళాలి? అన్న సందేహాలకు సమాధానాలు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో తోటి నాయకులు పక్కచూపులు చూస్తున్నప్పటికీ వారిని సముదాయించాల్సిన సీనియర్లు కూడా చేతులు కట్టుకు ‘పక్కచూపులకు తప్పు లేదులే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు పుకార్లు వైరల్ అవుతున్నాయి.