iDreamPost
android-app
ios-app

ఒక‌టే పాట.. టీడీపీ నోట‌..!

ఒక‌టే పాట.. టీడీపీ నోట‌..!

అధినేత ఒత్తిళ్లో.. ఎలాగైనా ప్రాభ‌వం చాటుకోవాల‌నో.. తెలీదుకానీ తెలుగుదేశం పార్టీ నేత‌లు పాడిన పాటే పాడుతున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌నే కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం పెద్ద‌ల‌ను క‌లిసినా దాన్ని రాజ‌కీయంగా వివాదం చేయ‌డం మామాలుగా మారింది. అయితే ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏమిటంటే ఒక‌టే పాట ప‌దే ప‌దే పాడితే బోరు కొడుతుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు గుర్తించుకోలేక పోవ‌డం. 15 రోజుల క్రితం జ‌గ‌న్ ఢిల్లీ టూర్ వెళ్లిన‌ప్పుడు ఎటువంటి వ్యాఖ్య‌లు చేశారో.. తాజాగా ప్ర‌ధానితో భేటీ తో కూడా అదే ప‌ల్ల‌వి అందుకున్నారు. ఈసారి ఆ పాట పాడ‌డం టీడీపీ ఎంపీ రామ్మూర్తినాయుడు వంతు కావ‌డం విశేషం.

చంద్ర‌బాబు మాట‌లు మ‌రిచిపోయి మాట్లాడారా..?

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తాజాగా మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉండి.. ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్నారని వైసీపీని విమ‌ర్శిస్తున్నారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారని పాత ప‌ల్ల‌వి అందుకున్నారు. ఇక్క‌డి వ‌ర‌కూ టీడీపీ పంథా మేర‌కు బాగానే మాట్లాడిన‌ట్లు అనిపించినా ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడే హ‌క్కు ఆ పార్టీ నేత‌ల‌కు ఉందా..? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతుండ‌డం టీడీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఇందుకు గ‌తంలో పార్టీ అధినేత చంద్రబాబు, త‌న‌యుడు లోకేష్ వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నారు. ప్ర‌త్యేక‌హోదాతో ఏమీ రాద‌న్న చంద్ర‌బాబు, దానికి వంత పాడిన లోకేష్ బాబు అది నిజం కాద‌ని చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎప్పుడూ అదే ఉత్కంఠ.. కార‌ణం అదేనా..‌

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ల‌ ప‌ట్ల తెలుగుదేశం పార్టీ చాలా ఉత్కంఠ క‌న‌బ‌రుస్తోంది. ఆయ‌న ఢిల్లీ వెళ్తున్నార‌ని తేదీ ఫిక్స్ అయిన‌ప్ప‌టి నుంచీ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే వ‌ర‌కూ దానిపై పెద్ద డిబేట్లు న‌డ‌ప‌డం ఆ పార్టీ నేత‌ల‌కు మామూలై అయిపోయింది. ఇప్పుడు రామ్మోహ‌న్ ఓ అడుగు ముందుకేసి వ‌ర‌స‌గా జ‌గ‌న్ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు? అమిత్ షాతో, ప్ర‌ధాన‌మంత్రితో ఎందుకు స‌మావేశం అవుతున్నారు? చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నానంటూ కొత్త పాట అందుకున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఆ పార్టీ ఎందుకంత రాద్దాంతం చేస్తోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ హ‌యాంలో జ‌రిగిన కుంభ‌కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వాటిపై చ‌ర్చించ‌డానికే ఢిల్లీ పెద్ద‌లు జ‌గ‌న్ ను పిలుస్తున్నారా..? ‌లేక ఆయ‌నే రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను వివ‌రించి టీడీపీకి చెక్ పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా..? అన్న భ‌యంతోనే ఢిల్లీ టూర్ల‌పై టీడీపీ అంత ఉత్కంఠ ప్ర‌ద‌ర్శిస్తుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.