Idream media
Idream media
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ప్రజలకు మేలు చేసే పథకం లేదా కార్యక్రమం.. ఇలా ఏదైనా సరే బోడిగుండుకూ మోకాలికి ముడివేసేలా విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు.. వైఎస్ జగన్ తన పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నా కూడా అదే స్థాయిలో గోల చేస్తుండడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న బుధవారం సీఎం జగన్.. వైసీపీ అధ్యక్షుడిగా తన పార్టీ పరమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. తాను పాలనతో బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలను ముగ్గురు నేతలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు 13 జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఎవరు ఏఏ జిల్లాల బాధ్యతలు చూడాలో స్పష్టంగా పని, బాధ్యత విభజించి దిశానిర్ధేశం చేశారు. అంతేకాకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డికి, పార్టీ అనుబంధ శాఖల వ్యవహారాలను విజయసాయి రెడ్డికి అప్పగించారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తన పార్టీకి చెందిన వ్యవహారం. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేనిది. మరి ఇక్కడ టీడీపీ నేతలు ఎందుకు గోల చేస్తున్నారో అర్థం కావడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని ముగ్గురుకు అప్పగించారు.. వారి సన్నిహితులకే పట్టం కట్టారు.. అంటూ టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యలతో సహా తో టీడీపీ తానా అంటే తందానా అనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. ప్రతిపక్షం కదా చేస్తుందనుకొవచ్చు. మరి ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా టీడీపీ నేతలు ఇలా గోల చేయడం వెనుకు ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదు.
వైసీపీలో ఎవరు ఏ పదవి చేపట్టాలి..? ఎవరికి ఏ బాద్యత అప్పగించాలి..? పార్టీ జిల్లాల సమన్వయ బాధ్యలు ఎవరికి ఇవ్వాలి..? అనే విషయాలు కూడా తాము చెప్పినట్లుగానే వైసీపీ అధిష్టానం చేయాలని భావిస్తున్నారా..? లేదా ఫ్లోలో ప్రభుత్వంపై చేసినట్లు వైసీపీ అంతర్గ వ్యవహారాలపై కూడా విమర్శలు చేస్తున్నారా..? అనేదే అంతుచిక్కకుండా ఉంది. ఏమైనా సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు, ఆరోపణలు చేసేందుకు రెడీగా ఉండే టీడీపీ నేతలు స్పందించే ముందు ఒకసారి ఆ నిర్ణయం ప్రభుత్వానిదో లేకా పార్టీతో తెలుసుకుంటే వారికే మంచిది. లేదంటే నవ్వులపాలు కావాల్సి వస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.