iDreamPost
android-app
ios-app

నీరు – చెట్టు అక్రమాలు: టిడిపి నేతలపై కేసులు

నీరు – చెట్టు అక్రమాలు: టిడిపి నేతలపై కేసులు

విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి రాజుల సొంతం. అలాంటి రాజరికం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఇది పక్కన పెడితే..విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గత టిడిపి పాలనలో నాయకులు దోచేశారు. ఎవరికి దొరికింది వారు బుక్కేశారు. చోటామూట నాయకుల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు వారి వారి స్థాయిల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతి ప్రభుత్వ పథకంలో కూడా అవినీతి లేనిదే అమలు లేదు. అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ అవినీతి అక్రమాలే చోటు చేసుకున్నాయి. అవి ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు–చెట్టు పనుల అక్రమాలపై మళ్లీ కదలిక మొదలైంది. ఎసిబి అధికారులు ఇప్పుడు అక్రమాలను వెలికి తీసేపనిలో పడ్డారు. అప్పట్లో టిడిపి నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు చేయకుండా బిల్లులు చేయించుకోవడం… నాసి రకం పనులతో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడంపై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. డిఈఈ, ఏఈలను సస్పెండ్‌ చేయడం కొంత మొత్తాన్ని రికవరీకి ఆదేశించారు. మరింత లోతుగా వెళ్లేందుకు ఎసిబి అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5.6 కోట్లకు పైగా ఉపాధి హామీ ద్వారా చేపట్టిన నీరు చెట్టు పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు తేలింది. ఇందులో దాదాపు సగానికి పైగా అంటే రూ.3.4 కోట్ల విలు వైన పనులు బొబ్బిలి నియోజకవర్గంలోని ఒక్క రామభద్రపురం మండలంలోనే జరిగినట్టు అప్పట్లో పలు శాఖల అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా ఎసిబి అధికారులు వీటి వివరాలను సేకరిస్తున్నారు. పలు శాఖలకు సంబంధించి విడుదలైన నిధులు, చేసిన బిల్లులపై ఆరా తీస్తున్నారు.  

రామభద్రపురం మండలంలో అభివృద్ధి పనుల ముసుగులో టిడిపి నాయకులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు విచారణ చేపట్టగా అక్రమాల గుట్టు బయటపడింది.. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి కోట్లలో బిల్లులు కాజేసినట్టు ఆధారాలు సంపాదించి కేసులు నమో దు చేశారు. ఈ అక్రమాలపై సివిల్‌ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి అప్పటి అధికార పార్టీ నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.

రామభద్రపురంలో 2015–16 ఏప్రిల్‌ వరకు ఉపాధి హామీ, జల వనరుల శాఖ ఆద్వర్యంలో జరిగిన ఉపాధి పనుల్లో టిడిపి నాయకులు పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు చేసుకోవడం.. నాసిరకంగా పనులు చేయడం.. తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదు చేయడం.. తూతూ మంత్రంగా చక్కబెట్టేసి సొమ్ము చేసుకోవడంపై పెద్ద ఎత్తున దుమారం రేగినా వారు లెక్క చేయలేదు. 2017 నవంబర్‌లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డిఈఈ ఆర్‌.ఆర్‌.విద్యాసాగర్, ఎఈఈలు శామ్యూల్, రవికాంత్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది.

2015–16లో రూ.5.7కోట్లతో చేపట్టిన 102 ఉపాధి పనులు సక్రమంగా లేవని, కొన్ని పనులు జరగకుండా బిల్లులు చెల్లించినట్లు గుర్తించి నివేదికలు విజిలెన్స్‌ ఎస్పీ హరికృష్ణకు అందజేశారు. వాటి ఆధారంగా ఆయన 2018 ఏప్రిల్‌లో మండలంలోని మామిడి వలస, కోటశిర్లాం, కొండకెంగువ, ఎస్‌ సీతారాంపురం, ఇట్లా మామిడిపల్లిలో అకస్మికంగా పర్యటించి కొన్ని పనుల నాణ్యతను పరిశీలించారు.

మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలకు టెక్నికల్‌ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాసిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేసినట్లు గుర్తించారు. మొత్తం నిధుల్లో సుమారు రూ.4 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్థారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అప్పగించినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుక్, చెక్‌ మెజర్‌మెంట్లలో మామిడివలస, నాయుడువలస, కోటశిర్లాం, తారాపురం గ్రామ సర్పంచ్‌లు తమ సంతకం ఫోర్జరీ చేశారని అప్పటి ఇరిగేషన్‌ ఈఈ జి.వి.రమణ ఫోలీసులకు పిర్యాదు చేసినా నామమాత్రంగా విచారణ జరిపినా చర్యలు తీసుకోలేదు.

రామభద్రపురంతో పాటు పలు మండలాల్లో 2015–16లో చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎంబుక్‌లు, ఎఫ్‌టివోలు, వర్క్‌ కమిట్‌మెంట్‌ లెటర్స్‌ తదితర వివరాలు పంపించాలని విజయనగరం ఎసిబి డీఎస్పీ కార్యాలయం నుంచి ఎంపిడిఒకు లేఖ అందజేశారు. ఈ విషయాన్ని రామభద్రపురం ఎంపిడిఒ బి.ఉషారాణి ధ్రువీకరించారు. ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఎసిబి అధికారులు కోరిన సమా చారం సిద్ధం చేయమని చెప్పినట్టు అప్పటి ఈఈ జి.వి.రమణ తెలిపారు.

తన సంతకాన్ని అప్పట్లో సర్పంచ్‌లే ఫోర్జరీ చేసినట్టు పోలీసులకు తానే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో కమిన్స్‌మెంట్‌ లెటర్లు, ఎం బుక్‌లు, పే ఆర్డర్‌ కాపీలు, ఎఫ్‌టీఓలు(ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌లు), బ్యాంక్‌ లావాదేవీల కాపీల వంటి పలు వివరాలు ఎసిబి అధికారులు కోరారు.